ఇరాన్ దాడుల్లో 20 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసం..ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

ఇరాన్ దాడులు
    • రచయిత, మెర్లిన్ థామస్, అలెక్స్ ముర్రే, మ్యాట్ మర్ఫీ
    • హోదా, బీబీసీ వెరిఫై
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన 20 సైనిక స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేసిందని బీబీసీ వెరిఫై విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాలు, వీడియోల్లో వెల్లడైంది.

బయటికి అంగీకరించిన దానికంటే మరింత విస్తృతంగా ఈ దాడులు జరిగాయని వీటి ద్వారా తెలిసింది.

ఫిబ్రవరి చివరి నుంచి మిడిల్ ఈస్ట్‌లోని ఎనిమిది దేశాల్లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల వల్ల అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలకు, ఇంధనం నింపే విమానాలకు, రాడార్లకు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.

గత మూడు నెలలుగా ఇరాన్, లెబనాన్‌లలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశ స్థావరాలను, ఉమ్మడి సైనిక కేంద్రాలు రెండింటినీ తెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంది.

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లోని 13,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై తాము దాడి చేశామని పెంటగాన్ చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా స్థావరాలపై దాడులలో తమ సైన్యం సాధించిన విజయాన్ని ప్రముఖంగా చెప్పుకునేందుకు ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ ప్రయత్నించారు.

మధ్యప్రాచ్యం ఇకపై అమెరికా స్థావరాలకు "సురక్షితమైన ప్రదేశం" కాదని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ సైన్యం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని వైట్ హౌస్ పదేపదే చెబుతున్నప్పటికీ, అమెరికా స్థావరాల వద్ద కనిపించిన నష్టాన్ని చూస్తే, తెహ్రాన్ ప్రతిదాడులు అమెరికా అధికారులు గతంలో అంగీకరించిన దానికంటే మరింత కచ్చితంగా, విస్తృతంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

బీబీసీ వెరిఫై కనుగొన్న వాటిపై స్పందించేందుకు అమెరికా రక్షణ అధికారి ఒకరు నిరాకరించారు. దీనికి భద్రతా కారణాల దృష్ట్యా ఆ విషయాలపై మాట్లాడలేమన్నారు.

ఈ సంఘర్షణకు చెందిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణను అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇరాన్, మధ్యప్రాచ్యంలోని చాలా ప్రాంతాలకు చెందిన కొత్త ఉపగ్రహ చిత్రాలపై నిరవధిక ఆంక్షలు విధించాలని ప్రముఖ ఉపగ్రహ సేవల సంస్థ ప్లానెట్‌ను కోరింది.

"మిత్రదేశాలను, నాటో భాగస్వామ్య సిబ్బందిని, పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి శత్రువులు తమ చిత్రాలను ఉపయోగించకుండా" చూసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ సమర్థించుకుంది.

ఇరాన్ దాడుల్లో జరిగిన నష్టాన్ని గుర్తించేందుకు ప్లానెట్‌కు చెందిన పాత చిత్రాలను, ఇతర అంతర్జాతీయ సంస్థలకు చెందిన ఉపగ్రహ చిత్రాలతో బీబీసీ వెరిఫై పోల్చిచూసింది.

ఈ కేంద్రాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్‌లలో ఉన్నాయి.

అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు, దెబ్బతిన్న స్థావరాల సంఖ్య 28 వరకు ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ రువైస్, అల్ సాదర్ వైమానిక స్థావరాలు, జోర్డాన్‌లోని మువాఫక్ సాల్తీ వైమానిక స్థావరంలో ఉన్న మూడు అత్యాధునిక యాంటీ-బాలిస్టిక్ మిసైల్ బ్యాటరీ సిస్టమ్‌లు ఈ దాడుల వల్ల దెబ్బతిన్న వాటిలో ఉన్నాయి.

ఎనిమిది టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (టీహెచ్ఏఏడీ, థాడ్) బ్యాటరీ (మిసైల్ లాంచర్లు, రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించే కేంద్రం)లను ప్రస్తుతం అమెరికా వాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సైనిక స్థావరాలో వీటిని మోహరించారు. వీటిని తయారు చేసేందుకు సుమారు బిలియన్ డాలర్లు (రూ.9,487 కోట్లు) ఖర్చవుతుంది.

ప్రతి బ్యాటరీని ఆపరేట్ చేయడానికి సుమారు 100 మంది సైనికుల సిబ్బంది అవసరం కాగా, అది ప్రయోగించే ఇంటర్‌సెప్టర్‌లకు ఒక్కో రౌండ్‌కు సుమారు 12.7 మిలియన్ డాలర్ల (రూ.120 కోట్లు) ఖర్చవుతుంది.

ఈ బ్యాటరీలు "అత్యంత సంక్లిష్టమైన" ప్రాంతీయ రక్షణ వ్యవస్థకు కేంద్రంగా ఉన్నాయని, వీటిని "వేగంగా లేదా సులభంగా" భర్తీ చేయడం సాధ్యం కాదని ఐరిష్ రక్షణ దళాల మాజీ అధిపతి, వైస్-అడ్మిరల్ మార్క్ మెల్లెట్ బీబీసీ వెరిఫైతో చెప్పారు.

ఇరాన్ దాడులు ఎక్కువగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లోని అమెరికా రీఫ్యూయలింగ్, సర్వైలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని నిపుణులు విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాలు చూపించాయి. దెబ్బతిన్న విమానాలు, పొగలు కక్కుతున్న గోతులు స్పష్టంగా కనిపించాయి.

ఎంఏఐఏఆర్ (MAIAR) విశ్లేషకుడు ఒక విమానాన్ని ఈ-3 సెంట్రీ నిఘా విమానంగా గుర్తించారు . దాని స్థానంలో మరొకటి తీసుకురావడానికి 700 మిలియన్ డాలర్ల (రూ.6,642 కోట్లు) వరకు ఖర్చు కావచ్చని అమెరికా మీడియా నివేదించింది.

అదేవిధంగా.. కువైట్‌లోని అలీ అల్ సలీం వైమానిక స్థావరం, క్యాంప్ అరిఫ్జాన్‌లను కూడా ఇరాన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ సంఘర్షణల కాలంలో పలుమార్లు దాడికి గురైన ఈ వైమానిక స్థావరం ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన ఎంఏఐఏఆర్ విశ్లేషకులు... ధ్వంసమైన ఇంధన నిల్వ బంకర్లు, వైమానిక హ్యాంగర్లు, సైనికుల నివాస ప్రాంతాలను గుర్తించారు.

క్యాంప్ అరిఫ్జాన్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ హార్డ్‌వేర్‌కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కంపెనీ జేన్స్ గుర్తించింది.

ఉపగ్రహ చిత్రాలు

అమెరికా సైనిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని లెక్కించడం చాలా కష్టం. కానీ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొత్తం ఖర్చు 29 బిలియన్ డాలర్లు (రూ.2,75,161 కోట్లు) అవుతుండొచ్చని పెంటగాన్ అంచనావేసింది.

ఈ ఖర్చులో చాలా వరకు సంఘర్షణ సమయంలో ధ్వంసమైన పరికరాల మరమ్మత్తు లేదా రీప్లేస్ చేసేందుకు వెచ్చించే అవకాశం ఉంది.

ఫిబ్రవరి నుంచి ఎఫ్-15, ఎఫ్-35 ఫైటర్ జెట్లు, 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, ఏ-10 అటాక్ ప్లేన్‌తో సహా కనీసం 42 విమానాలు ధ్వంసమైనట్లు లేదా దెబ్బతిన్నట్లు ఈ రిపోర్టు గుర్తించింది.

యుద్ధం జరిగే సమయంలో ఇరాన్ వ్యూహాలు క్రమంగా మారాయని, మధ్యప్రాచ్యం అంతటా నగరాలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా క్షిపణులను ప్రయోగించడం నుంచి మరింత కచ్చితమైన, నిర్దేశిత దాడుల చేయడం వైపుకు మరలిందని బీబీసీ వెరిఫైతో మాట్లాడిన నిపుణులు చెప్పారు.

''ఇరాన్ ప్రారంభ దాడులు భారీ సంఖ్యలో ఉండేలా ప్లాన్ చేశారు. అవి కేవలం తమ సంఖ్యా బలంతోనే వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా రూపొందించినవి" అని అమెరికాకు చెందిన 'స్టిమ్సన్ సెంటర్' థింక్ ట్యాంక్ విశ్లేషకులు డాక్టర్ కెల్లీ గ్రీకో తెలిపారు.

''కొన్నిరోజుల వ్యవధిలోనే ఇరాన్ చిన్న మొత్తంలో, మరింత కచ్చితంగా లక్ష్యాలవైపుకు తన దాడులను మరలించింది. నిర్దిష్టమైన అత్యంత విలువైన లక్ష్యాల కోసం మిగిలిన క్షిపణులను, డ్రోన్లను కేటాయించింది. అలాగే, తృటిలో తప్పినా గణనీయమైన నష్టం కలిగించే చోటే ఫైరింగ్ జరిపింది'' అని చెప్పారు.

ధ్వంసమైన స్థావరాలు

తెహ్రాన్ వ్యూహాలు మారుతున్న కొద్దీ ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల పరిధి నుంచి విమానాలను తరలించడంలో విఫలమవ్వడం ద్వారా అమెరికా సైన్యం యుద్ధం ప్రారంభంలో కొంతమేర నిర్లక్ష్యానికి పాల్పడినట్లు కనిపిస్తోందని ఎంఏఐఏఆర్‌లోని ఒక విశ్లేషకుడు బీబీసీ వెరిఫైకి తెలిపారు.

ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ విషయంలో, ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసం కావడానికి ముందే ఆ స్థావరంపై కాల్పులు జరిగాయని వారు చెప్పారు.

''ఈ ప్రాంతంలోని దేశాలు, భూభాగాలు ఇక అమెరికా సైనిక స్థావరాలకు రక్షణగా పనిచేయవు'' అని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ చెప్పారు.

''ఈ ప్రాంతంలో దుశ్చర్యలకు, సైనిక స్థావరాల ఏర్పాటుకు అమెరికాకు ఇకపై సురక్షితమైన స్థానం ఉండదు'' అని అన్నారు.

ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ మళ్లీ ప్రమాదంలో పడటానికి ముందు ఆయన ఈ కామెంట్లు చేశారు.

దక్షిణ ఇరాన్‌లో అమెరికా తాజాగా జరిపిన దాడుల తర్వాత ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) తెలిపింది.

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురై, తిరిగి యుద్ధం ప్రారంభమైతే, అమెరికా స్థావరాలకు ఇప్పటికే జరిగిన నష్టాన్ని బట్టి చూస్తే గల్ఫ్ అంతటా ఉన్న సైనిక కేంద్రాలు ప్రమాదంలో పడొచ్చని డాక్టర్ గ్రీకో హెచ్చరించారు.

''ప్రస్తుత సంఘర్షణతో అమెరికా, దాని మిత్రపక్షాలు వాయు రక్షణ ఆయుధ సంపత్తిని గణనీయమైన పరిమాణంలో ఉపయోగించాయి'' అని చెప్పారు.

(అదనపు రిపోర్టింగ్.. బార్బరా మెట్‌జ్లర్, టామ్ గౌల్డ్)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)