‘నేను గర్భం దాల్చినట్లు నాకంటే ముందు నా ఫిట్‌నెస్ ట్రాకర్‌కు తెలిసిపోయింది’

- రచయిత, అషితా నగేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
రవిక తన భర్తతో కలిసి పుట్టిన రోజు వేడుక చేసుకుంటున్న సమయంలో ఆమె ఫిట్‌నెస్ ట్రాకర్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది.
ఆమె హెల్త్ స్కోర్ పేలవంగా ఉందని ఆమె ధరించే ‘ఓరా రింగ్ సూచించింది. దీంతో ఆమె హార్ట్ బీట్ రేట్, బాడీ టెంపరేచర్ పెరిగాయి.
ఆమె హార్ట్ రేట్ వేరియబులిటి పడిపోయింది. అయినప్పటికీ రవిక తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నట్లు భావించారు.
వారం రోజుల తర్వాత కూడా ఆరోగ్యానికి సంబంధించిన గణాంకాలు మెరుగుపడకపోవడంతో వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన ఈ 34 ఏళ్ల న్యాయవాది ఆన్‌లైన్‌లో కొంత పరిశోధన చేశారు.
తమ ఫిట్‌నెస్ ట్రాకర్ సేకరించిన డేటా ఆధారంగా.. తాము గర్భం ధరించినట్లు ఆ ట్రాకర్లు సంకేతాలు ఇస్తున్నాయని ఆన్‌లైన్‌లో వెల్లడించిన ఓ గ్రూప్‌ను ఆమె గుర్తించారు. మరో వారం గడిచిన తర్వాత రవిక గర్భ నిర్ధరణ పరీక్ష చేయించుకున్నప్పుడు ఆమెకు పాజిటివ్ వచ్చింది.

కడుపు నొప్పి రావడంతో పాటు.. తన శరీరం తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు నోటిఫికేషన్ రావడంతో ఆమె డాక్టర్ వద్దకు వెళ్లారు.
ఆమె గర్భం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు మరి కొన్ని పరీక్షలు చేసేందుకు 10 రోజుల తర్వాత మళ్లీ రావాలని డాక్టర్ సూచించారు.
వేచి చూడటం ఆమెకు చాలా బాధగా అనిపించింది. రోజూ తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి "నా ఆరోగ్యానికి సంబంధించిన గణాంకాలు ఇంకా తక్కువగా ఉన్నాయా, బాడీ టెంపరేచర్ ఇంకా ఎక్కువగానే ఉందా అనేది తెలుసుకోవడానికి యాప్‌ను రిఫ్రెష్ చేసేదాన్ని" అని ఆమె చెప్పారు.
ఫిట్‌నెస్ ట్రాకర్ గణాంకాలను చూసిన తర్వాత "గర్భం నిలబడుతుందనే ఆశతో ఉన్నాను" అని రవిక చెప్పారు.
యాప్‌లో హెల్త్ వేల్యూస్ చూడటం ఒక వ్యసనంలా మారిందని ఆమె చెప్పారు.
"అది నిజంగానే జీవన్మరణ సమస్యలా అనిపించింది" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Ravika
గర్భం ధరించినట్లు తెలుసుకోవడానికి మొదటి సంకేతం సమయానికి నెలసరి రాకపోవడం.
గర్భాన్ని ముందుగా గుర్తించగలమని చెప్పుకునే కొన్ని పరీక్షలు మినహా, చాలా వరకు నెలసరి ఆగిపోయిన తొలి రోజు వరకు హార్మోన్లలో మార్పును గుర్తించలేవు.
అయితే ఫిట్‌నెస్ ట్రాకర్లలోని డేటా ద్వారా పరీక్ష చేయించుకోవడానికి ముందే గర్భానికి సంబంధించిన సంకేతాలను చూస్తున్నామని ఆన్‌లైన్‌లో వెల్లడించిన వందల మంది మహిళల్లో రవిక ఒకరు.
స్మార్ట్ రింగులు, స్మార్ట్ వాచ్‌లు, ఛాతీకి అమర్చుకునే ట్రాకర్‌లతో సహా ఫిట్‌నెస్ ట్రాకర్‌లు బ్రిటన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి.
2026 జనవరి నాటికి 36 శాతం మంది బ్రిటిష్ యువత ఫిట్‌నెస్ ట్రాకర్‌ను ఉపయోగించారు. 2019జూలైతో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉందని యూగవ్ రీసర్చ్ చెబుతోంది.
వేలికి పెట్టుకునే స్మార్ట్ రింగ్ మార్కెట్‌లో ఫిన్లాండ్‌కు చెందిన ఓరా కంపెనీ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.
భారత్‌కు చెందిన అల్ట్రా హ్యూమన్, హాంగ్‌కాంగ్‌కు చెందిన రింగ్ కాన్‌కు కూడా మార్కెట్‌లో మంచి వాటా ఉంది.

గర్భస్రావం, గర్భధారణను అంచనా వేయడం
గర్భధారణకు సంబంధించిన కీలక సంకేతాలలో ఒకటి శరీర ఉష్ణోగ్రతలో మార్పు. గర్భం ధరించాలనుకునే వారిలో శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షించగల ట్రాకర్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి.
సాధారణ రుతుచక్రంలో మహిళలకు నెలసరి వచ్చే ముందు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి ఆ తర్వాత వేగంగా పడిపోతుంది. గర్భం దాల్చిన తొలినాళ్లలో శరీర ఉష్ణోగ్రత సాధారణంగా అధికంగానే ఉంటుంది. ఒకవేళ ఫిట్‌నెస్ ట్రాకర్ శరీర ఉష్ణోగ్రతను కొలిస్తే, అది ఈ తొలి లక్షణాన్ని గుర్తిస్తుంది.
ఓరా స్మార్ట్ రింగ్ గర్భధారణ గురించే కాకుండా గర్భస్రావం గురించి కూడా ముందుగానే ఊహించిందని చెబుతూ రెడ్డిట్‌లో కొందరు మహిళలు రాసిన పోస్టులను రవిక చదివారు.
వారిలో 32ఏళ్ల సోఫియా ఒకరు. ఆమె రెండుసార్లు గర్భాన్ని కోల్పోయారు. ఈ రెండు సందర్భాలను ఔరా స్మార్ట్ రింగ్ ముందుగానే గుర్తించింది. ఆమె మూడోసారి గర్భం ధరించినప్పుడు కూడా స్మార్ట్ ఉంగరం నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ప్రస్తుతం ఆమెకు 5నెలల వయసున్న బాబు ఉన్నాడు.
గతేడాది మొదట్లో ఆమె తొలిసారి గర్భవతి అయినప్పుటు ప్రతీ ఉదయం యాప్‌ను చూసుకునే వారు.
"నిద్ర లేచి చూసే సరికి యాప్‌లో ఉష్ణోగ్రత గీత పెరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఒక రోజు ఉదయం నా బాడీ టెంపరేచర్ తగ్గినట్లు కనిపించింది. నా శరీరంలో ఏదో తేడా వచ్చిందని నాకు అప్పుడే అర్థమైంది" అని సోఫియా చెప్పారు.
నాకు గర్భస్రావం అయినప్పుడు, ముందే తెలిసిన సమాచారం వల్ల అప్పటికే నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను.
3 నెలల తర్వాత మళ్లీ అదే జరిగింది. దీంతో సోఫియా, ఆమె భర్త.. గర్భం ధరించే ప్రయత్నానికి విరామం ఇవ్వాలనుకున్నారు. అయితే ఈ విరామ సమయంలో ఆమె స్మార్ట్ రింగ్‌లో "తేలికపాటి ఒత్తిడి సంకేతాలు" ఉన్నట్లు నోటిఫికేషన్ వచ్చింది. తన శరీర ఉష్ణోగ్రత మళ్లీ పెరిగినట్లు ఆమె గుర్తించారు. దీంతో ఆమె పరీక్ష చేయించుకోవడం పాజిటివ్ వచ్చింది.
ఈసారి గర్భం ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ గర్భం వచ్చిన తొలి వారాల్లో సోఫియా తరచుగా ఆందోళన చెందేవారు. పదే పదే యాప్‌లో డేటాను చెక్ చేసుకున్నారు.
"నేను ప్రతీసారి అయ్యో దేవుడా, మళ్లీ అలాగే జరుగుతుందా? అని అనుకున్నాను. నాకు గుర్తుంది. తెల్లవారుజామున నాలుగు లేదా ఐదు గంటలకు నిద్రలేచి నా బాడీ టెంపరేచర్ తగ్గిందా లేదా అని యాప్‌ను చూసుకునేదాన్ని" అని ఆమె చెప్పారు.
"ఆ విషయం గురించి నేను ఎంతగా ఆలోచించానంటే ఏడు లేదా ఎనిమిది వారాల గర్భవతిగా ఉన్నప్పుడు నా స్మార్ట్ రింగ్ తీసేశాను. మొదటి మూడు నెలలు దాన్ని ధరించలేదు" అని సోఫియా అన్నారు.

పెరుగుతున్న ఆందోళన
"ప్రజలు తమ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించడం అర్థం చేసుకోగిందే. ఎందుకంటే మీరు గర్భం ధరించాలని అనుకుంటే అది మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది" అని లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్‌లో రీ ప్రొడక్టివ్ మెడిసిన్‌లో వైద్య సలహాదారు డాక్టర్ స్టువర్ట్ లావెరీ అన్నారు.
అయితే ఈ టెక్నాలజీ ఉపయోగించడం "నడవడానికి ముందే పరిగెత్తుతున్నామేమో" అని ఆయన హెచ్చరించారు.
"ఈ టెక్నాలజీ మీద ఆధారపడవచ్చా లేదా అనేది మరింత డేటా అవసరం. మనం ఇంకా చాలా రీసర్చ్ చేయాలి. లేకపోతే మీలో ఆందోళన అంతు లేకుండా పెరిగిపోతుంది" అని లావెరీ అభిప్రాయపడ్డారు.
"ఈ సాంకేతికత, యాప్ ఆధారిత గణంకాల విధానాన్ని రాబోయే రోజుల్లో మరింత మంది ఉపయోగిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వాటి కచ్చితత్వం మీద మనం ఎంత వరకు ఆధారపడవచ్చు అనే దాని విషయంలో పెద్ద హెచ్చరిక ఉండాలి అనుకుంటున్నాను" అని ఆయన అన్నారు.
గర్భం దాల్చిన తొలినాళ్లలో మహిళలు తమ స్మార్ట్ రింగ్ డేటాను తనిఖీ చేయడం వల్ల ఆందోళనకు గురవుతున్నట్లు వచ్చిన కథనాల గురించి ఓరా సంస్థ మహిళల ఆరోగ్య విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్ కర్రీతో బీబీసీ మాట్లాడింది.
"ట్రాకింగ్ ఉన్నా లేకపోయినా గర్భధారణ అనేది కొంత ఆందోళన కలిగించే సమయం. ఈ సమయంలో చాలా మంది మహిళలు ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన వారు, సాధారణంగా ఉండే పరిస్థితి పరిధి గురించి అయోమయంలో ఉంటారు" అని క్రిస్ కర్రీ చెప్పారు.
ఒకవేళ మహిళలు ఒత్తిడికి గురైతే "యాప్ వాడకం ఆపాలని మేం మా వినియోగదారుల్ని ప్రోత్సహిస్తాం. ఈ రింగ్ ఒక సహాయ సాధనం మాత్రమే. మీ సంరక్షణ బృందానికి ప్రత్యామ్నాయం కాదు" అని ఆమె చెప్పారు.
అయితే, రవికకు గర్భస్రావమైంది. ఆమె త్వరలోనే మళ్లీ గర్భం ధరించాలని భావిస్తున్నారు. తన అనుభవం వల్ల ట్రాకర్‌ను మళ్లీ ధరించడం గురించి ఆమె పునరాలోచన చేస్తున్నారు.
"నేను ఆందోళన చెందే వ్యక్తిని కాదు. భవిష్యత్తులో ఒకవేళ నేను గర్భవతిని అని తేలితే స్మార్ట్ రింగ్‌ను తీసివేయడమే ఉత్తమమైన పని అని నేను భావిస్తున్నాను" అని రవిక చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































