ఇది టెర్రస్ గార్డెన్ కాదు, ఆస్పత్రి ఐసీయూ..

రూఫ్-టాప్ ఐసీయూ, రూఫ్-టాప్ గార్డెన్, బ్రిటన్, ఆసుపత్రి, రోగులు
    • రచయిత, విక్కీ లోడర్
    • హోదా, బీబీసీ న్యూస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

29 ఏళ్ల హోలీ అలెన్ ఆసుపత్రి లిఫ్ట్‌లో ఉన్నారు. రెండు నెలల తర్వాత మొదటిసారి ఆమెను ఐసీయూ నుంచి బయటకు తరలిస్తున్నారు.

లిఫ్ట్ పైకి వెళ్తోంది. ఆసుపత్రి భవనం మీద ఏర్పాటు చేసిన ఓ కొత్త బహిరంగ ప్రదేశానికి (ఓపెన్ ఎయిర్ రూమ్‌) వైపు ఆమెను తీసుకెళ్తున్నారు.

'చలిగా ఉండొచ్చు, జాగ్రత్త' అని లిఫ్ట్‌లో హోలీ అలెన్ బెడ్ చుట్టూ నిల్చున్న నర్సులు చెబుతున్నారు. తలుపులు తెరుచుకోగానే సూర్యకిరణాలు హోలీ ముఖంపై పడ్డాయి.

ఆమె ముఖంలో వెంటనే చిరునవ్వు మెరిసింది. కానీ అదే క్షణంలో ఆమె కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి.

"ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా బావుంది" అని ఆమె తన కళ్లను తుడుచుకుంటూ అన్నారు.

"బయట ప్రపంచం ఎలా ఉంటుందో నేను దాదాపుగా మర్చిపోయాను."

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రూఫ్-టాప్ ఐసీయూ, రూఫ్-టాప్ గార్డెన్, బ్రిటన్, ఆసుపత్రి, రోగులు

ఫొటో సోర్స్, Emma Lynch

ఇప్పటికీ ఆసుపత్రి బెడ్‌పైనే ఉంటూ.. ఫీడింగ్ ట్యూబులు, లైఫ్ సపోర్ట్ పరికరాలపై ఆధారపడుతున్న హోలీ, దక్షిణ లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొత్త రూఫ్ - టాప్(ఆస్పత్రి భవనంపైన) ఐసీయూను ఉపయోగించిన తొలి పేషెంట్.

బ్రిటన్‌లో ప్రత్యేకమైన ఈ ఓపెన్ - ఎయిర్ వార్డులో ఆరుగురు రోగులకు సరిపడా స్థలం ఉంది. ప్రతి బెడ్ పక్కన ఏర్పాటు చేసిన వాటర్‌ప్రూఫ్ బాక్స్‌లో విద్యుత్, ఆక్సిజన్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రత్యేకంగా రూపొందించిన షెల్టర్ వల్ల తీవ్రంగా అనారోగ్యంగా ఉన్న రోగులకు కూడా అవసరమైన అన్ని లైఫ్ సపోర్ట్ వ్యవస్థలతో, సురక్షితంగా బయట కూడా చికిత్స అందించవచ్చు.

బయటి వాతావరణానికి, ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల రోగుల మానసిక ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఆసుపత్రిలో వారు గడిపే సమయాన్ని కూడా తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఈ కారణంగానే చాలాకాలం నుంచి ఆసుపత్రుల్లో చిన్నపాటి తోటలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల అవసరాలను అవి చాలా అరుదుగా మాత్రమే తీర్చగలిగేవి.

దీర్ఘకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇది చాలా ఉపయోగకరమని కింగ్స్ ఆసుపత్రిలోని డాక్టర్లు చెబుతున్నారు.

రూఫ్-టాప్ ఐసీయూ, రూఫ్-టాప్ గార్డెన్, బ్రిటన్, ఆసుపత్రి, రోగులు

ఫొటో సోర్స్, King's College Hospital

ఈ రూఫ్ - టాప్ వార్డు రోగులు కోలుకునే ప్రక్రియను వేగవంతం చేయగలదా, లేదా అనేది అధ్యయనం చేసేందుకు రోగుల గుండె స్పందన రేటు, శ్వాస రేటు, నొప్పి స్థాయిలను పర్యవేక్షించేందుకు వారు సిద్ధమయ్యారు.

గుండె శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్న హోలీ, ఆసుపత్రిలో చేరకముందు నుంచే అసలు బయటకి వెళ్లే స్థితిలో లేరు.

ఐసీయూలో ఆమె గడిపిన కాలం కూడా ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది.

"రోజంతా ఒకేచోట కట్టేసినట్టుగా ఉంటే మళ్లీ సాధారణ జీవితం అనుభవించాలనే ఉత్సాహం కనుమరుగవుతుంది. పోరాడి పోరాడి అలసిపోతారు" అని హోలీ అన్నారు.

ఈ కొత్త రూఫ్ - టాప్ గార్డెన్‌ను ఆసుపత్రిలోని 60 పడకల ఐసీయూతో అనుసంధానించారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఐసీయూలలో ఒకటి.

హోలీ ఇక్కడ కొన్ని గంటల పాటు గడపవచ్చు, వాతావరణం బావుంటే.

"పిడుగులు పడుతున్నా నేను ఇక్కడే ఉండి చూసేదాన్ని. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది" అని హోలీ చెప్పారు.

రూఫ్-టాప్ ఐసీయూ, రూఫ్-టాప్ గార్డెన్, బ్రిటన్, ఆసుపత్రి, రోగులు

ఫొటో సోర్స్, Emma Lynch

రూఫ్ - టాప్‌లో కొన్నిచోట్ల గుడారాల వంటి కవర్లతో కొంతవరకు కప్పారు.

ఆసుపత్రి జీవనానికి పరిమితమై "వాస్తవ జీవితానికి దూరమైన" రోగులు మళ్లీ సాధారణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రకృతి వాతావరణం ఉపయోగపడుతుందని కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ నిపుణులు డాక్టర్ ఫిల్ హాప్కిన్స్ చెప్పారు.

"మేం కేవలం ప్రాణాలు కాపాడాలనుకోవడం లేదు, వారు వీలైనంత త్వరగా తిరిగి వారి సాధారణ జీవితాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు.

హాప్కిన్స్, ఆయన బృందం అవుట్-డోర్ ప్రదేశాలలో గడిపే సమయం రోగులపై చూపే ప్రభావాన్ని నిశితంగా పరిశీలించనున్నారు. అయితే, దీని వల్ల లాభపడేది రోగులు మాత్రమే కాదు.

ఇంటెన్సివ్ కేర్ సిబ్బంది కూడా విరామ సమయాల్లో ఈ రూఫ్ - టాప్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వారికి కూడా కొంత మానసిక ఉపశమనం కలిగిస్తుందని ఆసుపత్రి నిర్వాహకులు ఆశిస్తున్నారు.

రూఫ్-టాప్ ఐసీయూ, రూఫ్-టాప్ గార్డెన్, బ్రిటన్, ఆసుపత్రి, రోగులు

ఫొటో సోర్స్, Emma Lynch

ఇది సాధారణ ఆసుపత్రి వార్డుకు పూర్తిగా భిన్నమైన వాతావరణమని గార్డెన్ రూపకర్త సారా ప్రైస్ చెప్పారు.

ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ నైజెల్ డన్నెట్‌తో కలిసి ఆమె ఈ రూఫ్-టాప్ గార్డెన్‌లలోని మొక్కల అమరికను రూపొందించారు. అయితే, తోట పూర్తికాకముందే ఆయన మరణించారు.

ఈ తోటలో హనీసకిల్, జాస్మిన్, లావెండర్ వంటి సువాసన వచ్చే పూల మొక్కలతో పాటు రోగులు తమ బెడ్‌పై నుంచే తాకి, వాసన చూడగలిగే విధంగా విభిన్న ఆకృతుల ఆకులు, మొక్కలను ఏర్పాటు చేశారు.

తోటలు మనుషుల్లో నెమ్మదిగా జీవితంపై ఆసక్తిని పెంచుతాయి, ప్రకృతికి మరింత దగ్గరగా అనిపించేలా చేస్తాయని సారా ప్రైస్ అంటున్నారు.

"వారి ముఖాల్లోనే కాదు, వారు శ్వాస తీసుకునే విధానంలో కూడా మార్పు కనిపిస్తుంది" అని ఆమె అన్నారు.

ఈ తోట నిర్మాణానికి ఖర్చైన 27 లక్షల డాలర్లకు పైగా నిధులను ఆసుపత్రి చారిటీ సంస్థ సమీకరించింది.

ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్లైవ్ కే మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కేవలం రోగుల ఆసుపత్రి అనుభవాన్ని మెరుగుపరచడానికే పరిమితం కాకుండా, అంతకుమించి ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)