అమెరికా ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, కానీ...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథోనీ జర్చర్
- హోదా, బీబీసీ నార్త్ అమెరికా కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు తెరదింపేందుకు ఇరు దేశాలు ఒక శాంతి ఒప్పందానికి రావడం డోనల్డ్ ట్రంప్‌కు పుట్టినరోజు కానుకే అని చెప్పుకోవచ్చు.
కానీ ఆ కానుక చుట్టూ ఎంతో అనిశ్చితి కూడా ఉంది.
ఒప్పందాన్ని ప్రకటిస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో హార్ముజ్ జలసంధి వాణిజ్య నౌకలకు తెరిచి ఉంటుందని, అమెరికా కూడా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని ప్రకటించారు.
'చమురు ప్రవాహన్ని ఇక కొనసాగనివ్వండి' అని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు.
మునుపటి అమెరికా అధ్యక్షులెవ్వరూ సాధించలేకపోయిన విజయాన్ని తాను సాధించానని, ఈ "గొప్ప ఒప్పందం" మొత్తం ప్రాంతానికి (మధ్యప్రాచ్యానికి) శాంతి, భద్రతలను తీసుకువస్తుందని ట్రంప్ ప్రకటించారు.

అయితే ఇలాంటి నాటకీయమైన వ్యాఖ్యలు చేయడం ట్రంప్‌కు కొత్తేమీ కాదు. నిరుడు గాజా యుద్ధానికి ముగింపు పలికిన ఒప్పందాన్ని కూడా ఆయన 'శాశ్వతమైన శాంతి' ఒప్పందంగా అభివర్ణించారు.
కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
ఇలాంటి కీలకమైన దౌత్య ఒప్పందాల విషయంలో విజయం, వైఫల్యం సాధారణంగా చిన్న చిన్న అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలు చాలా పరిమితంగానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం సాయంత్రం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సొంతం చేసుకోకుండా ఉండేలా ఈ ఒప్పందాన్ని రూపొందించామని చెప్పారు. ఒప్పంద నిబంధనలను ఇరాన్ పాటిస్తోందో లేదో అమెరికా నిర్ధరించగలదని కూడా పేర్కొన్నారు.
అయితే యురేనియం శుద్ధీకరణపై ఎలాంటి పరిమితులు విధించబోతున్నారు, ప్రస్తుతం ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం భారీ నిల్వల భవిష్యత్తు ఏంటి వంటి కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు.
ప్రస్తుత కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో జరగబోయే తదుపరి సంప్రదింపుల్లో, సమగ్ర చర్చల్లో ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించుకునేందుకు దశాబ్దాలుగా సాగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాల చరిత్ర ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ 'అవగాహన ఒప్పందం'లో అమెరికా ఎంతో సాధించామని భావించినా, ఎలాంటి హామీలు మాత్రం ఉండవు.
ఈ వాస్తవాన్ని మరింత స్పష్టం చేస్తూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, 'అవగాహన ఒప్పందం కింద మరో పక్షం తన బాధ్యతలను అమలు చేసిన తర్వాతే తుది చర్చలు కొనసాగుతాయి' అని పేర్కొంది.
ఆ బాధ్యతలు ఏమిటి, వాటిని ఇరాన్ ఎలా అర్థం చేసుకుంటుందనే విషయమే ఈ ఒప్పందం భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారనుంది.

ఫొటో సోర్స్, Getty Images
హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణ, యుద్ధానికి ముందున్న స్థాయికి వెంటనే చేరుకునే అవకాశం లేదని ఇంధన మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ సంఖ్యలో పేరుకుపోయిన చమురు ట్యాంకర్లను తరలించడం, సముద్రంలోని ల్యాండ్‌మైన్‌లను నిర్వీర్యం చేయడం, సాధారణ చమురు రవాణాను, ఉత్పత్తిని పునరుద్ధరించడం వంటి ప్రక్రియలకు మరికొన్ని వారాలు పట్టచ్చని వారు చెబుతున్నారు.
అధికారిక సంతకాలకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండటంతో, ఒప్పందం విజయానికి అవసరమైన కీలక అంశాలపై అమెరికా, ఇరాన్‌లకు ఇంకా చర్చించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందం విఫలమయ్యే ప్రమాదమూ లేకపోలేదు.
ఈ మొత్తం పరిణామంలో కొరకని కొయ్యగా ఉన్న మరో అంశం ఇజ్రాయెల్.
వాస్తవానికి ఇది ఎప్పటినుంచో ముక్కోణపు యుద్ధంగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌పై వారాంతంలో దాడులకు ఆదేశించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ట్రంప్ ఆదివారం వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. దాదాపు తుది దశకు చేరుకున్న ఇరాన్ ఒప్పందాన్ని ఆ దాడులు దెబ్బతీసే ప్రమాదం ఉందని తాను భావించినట్లు చెప్పారు.
అయితే కనీసం బహిరంగ ప్రకటన వెలువడేంత వరకు ఒప్పందం నిలిచి ఉన్నట్లే. కానీ ఇజ్రాయెల్ మళ్లీ లెబనాన్‌లో సైనిక చర్యలకు దిగితే, ఇరాన్ మరోసారి హార్ముజ్ జలసంధిని మూసివేసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలా జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఈ సందర్భంగా వాన్స్ ఒక మాటన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో పాటు వాటి ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక భారం అనేకమంది అమెరికన్లను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఒప్పుకున్నారు.
"అమెరికా ప్రజలకు నా ప్రధాన సందేశం ఒక్కటే. మీ అందరికి ధన్యవాదాలు" అని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరలు తగ్గుముఖం పడతాయని కూడా హామీ ఇచ్చారు.
అది ఎంత వేగంగా జరుగుతుంది, ఆ తగ్గుదల అమెరికన్ల దైనందిన జీవన వ్యయాలపై ఎంత త్వరగా ప్రభావం చూపుతుంది అనే విషయమే నవంబర్‌లో జరగనున్న మధ్యంతర కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి ఎంత మేర తగ్గుతుందో నిర్ణయించనుంది.
ట్రంప్, ఆయన పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు ఇటీవలి సర్వేలు సూచిస్తున్నాయి. యూగవ్ నిర్వహించిన సర్వే ప్రకారం ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ట్రంప్ పనితీరును 63 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకించగా, 57 శాతం మంది దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోందని అభిప్రాయపడ్డారు.
అయితే కనీసం ఆదివారం ప్రకటించిన ఈ ఒప్పందం, కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని కొంత మేర తగ్గించే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గడం ప్రారంభమైతే పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే భావన అమెరికన్లలో బలపడవచ్చు.
ట్రంప్ నిర్దేశించుకున్న విస్తృత లక్ష్యాలు ఇప్పటికీ పూర్తిగా నెరవేరకపోయినా, స్వదేశంలో రాజకీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, యుద్ధానికి ముందు పరిస్థితుల వైపు తిరిగి అడుగులు వేయడంలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన ముందడుగుగా కనిపిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























