సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌కు దిగి ముగ్గురు మృతి.. మనుషులతో మానవ వ్యర్థాలను శుభ్రం చేయించవచ్చా, చట్టం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
హైదరాబాద్‌లో సెప్టిక్ ట్యాంకులో పనిచేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. బాచుపల్లిలోని ఒక ప్రైవేటు అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.
తగిన రక్షణ పరికరాలు ఇవ్వకుండా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులను సెప్టిక్ ట్యాంకులో దించడంతో విష వాయువులు పీల్చి ఆ ముగ్గురూ చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, కొత్తూరు ప్రాంతాలకు చెందిన 20 ఏళ్ల యల్లా పవన్, 26 ఏళ్ల షణ్ముఖ రావు (సుమన్), 24 ఏళ్ల సురేశ్ అని బాచుపల్లి పోలీసులు చెప్పారు.
నవంబర్ 24 మంగళవారం ఉదయం సుమారు 11.30 ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు ప్రకటించారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాచుపల్లికి చెందిన దినేశ్ ఆరిక్ అపార్ట్మెంట్ తమ సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ బాధ్యత హెచ్ఆర్ ఇన్విరో అనే సంస్థకు అప్పగించింది.

మూడేళ్ల నుంచి ఇదే సంస్థ కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పని చేస్తోంది.
ఆ క్రమంలోనే నవంబర్ 24న కూడా శుభ్రం చేయడానికి హెచ్ఆర్ ఇన్విరో సిబ్బంది వచ్చారు.
''ముందుగా షణ్ముఖ రావు దిగారు. ఆయన అరుపులు వినిపించి కాపాడటానికి సురేశ్, ఆ తరువాత పవన్ దిగారు. లోపల వాయువుల వల్ల ఊపిరి ఆడక వీరు చనిపోయారని మేం ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించాం'' అని బాచుపల్లి ఇన్స్పెక్టర్ దాలి నాయుడు బీబీసీతో చెప్పారు
''హెచ్ఆర్ ఇన్విరో సంస్థ పంపిన సిబ్బందికి రక్షణ పరికరాలు (సేఫ్టీ ఎక్విప్మెంట్) ఇవ్వలేదని తెలుస్తోంది. వారికి సరైన ఎక్విప్మెంట్ ఇవ్వకుండా, నిర్లక్ష్యంతో వారి మరణానికి కారణమయ్యారని కేసు నమోదు చేశాం. హెచ్ఆర్ ఇన్విరో సంస్థకు చెందిన రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తున్నాం'' అని దాలి నాయుడు అన్నారు.
సెప్టిక్ ట్యాంకులో మనుషులు చిక్కుకున్నారనే సమాచారంతో అక్కడకు చేరుకున్న హైడ్రా, ఫైర్ విభాగాల సిబ్బంది వారి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు.
ఈ ఘటనపై మాట్లాడేందుకు హెచ్ఆర్ ఇన్విరో సంస్థను బీబీసీ సంప్రదించింది.
వారు ఫోన్లో అందుబాటులో రాకపోవడంతో మెయిల్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసింది. వారి స్పందన రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
చట్టమేం చెబుతోంది?
భారత్‌లో మనుషులను మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపయోగించరాదంటూ చట్టం (Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act, 2013) ఉంది. యంత్రాలను ఉపయోగించలేని స్థితిలో మాత్రమే మనుషులను లోపలకు దింపాలని ఈ చట్టంలోని నిబంధనల్లో వివరంగా ఉంది.
ఒకవేళ యంత్రాలను ఉపయోగించలేని స్థితిలో మనుషులను దించాల్సి వస్తే.. వారి రక్షణకు ఇవ్వాల్సిన జాబితాలో 40కుపైగా వస్తువులను పొందుపరిచారు.
ఈమేరకు సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే వారికి ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వాలి.
వ్యాధి కారకమయ్యే వ్యర్థ పదార్థాలు మనుషుల శరీరానికి తగలకుండా ఉండేలా చూసే వస్తువులు (ఉదా: గ్లౌజులు) ఇవ్వాలి.
వ్యాధికారక వాయువులు పీల్చకుండా బ్రీతింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి.
ట్యాంకు లోపల ఏమైనా విష వాయువులు ఉన్నాయా అని గుర్తించే పరికరాలు ఇవ్వాలి. వారికి ఇతరత్రా గాయాలు కాకుండా చూడాలి.
ఈ చట్టం, సుదీర్ఘ వివరణలతో కూడిన నిబంధనలు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్నాయి.
ఈ వృత్తిపై డాక్టర్ బలరాం సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు విస్తృతమైన తీర్పు ఇచ్చింది.
క్రమంగా మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థ తొలగించడం, మెకనైజేషన్, నష్ట పరిహారం పెంచడం వంటి అంశాలు ఆ తీర్పులో ఉన్నాయి.
కేవలం ప్రైవేటు మాత్రమే కాకుండా, ప్రభుత్వ, స్థానిక సంస్థలు కూడా ఈ పని విషయంలో పాటించాల్సిన పాలసీలు స్పష్టంగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 2017లో, తెలంగాణ ప్రభుత్వం 2018లో పాలసీలు తెచ్చాయి.
చట్టాలు, కోర్టు తీర్పులు ఇంత పకడ్బందీగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
మురుగు శుభ్రత కోసం వెళ్లిన వారు అందులో చిక్కుకోవడం, విషవాయువులు పీల్చడం.. ఇలా రకరకాల కారణాలతో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
సఫాయి కర్మచారీ జాతీయ కమిషన్ వివరాల ప్రకారం 1993 నుంచి 2026 సెప్టెంబరు వరకూ మొత్తం 1412 మంది ఈ వృత్తిలో చనిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























