సెప్టెంబర్‌లో వర్షపాతం గురించి వాతావరణశాఖ ఏం చెబుతోంది, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి, ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంది?

వర్షాలు, ఎండలు, ఎల్‌నినో, సెప్టెంబర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రాంతాలలో సెప్టెంబర్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.

అలాగే సెప్టెంబర్‌లో గరిష్ఠ,కనిష్ఠ ఉష్ణోగ్రతలు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఆగస్టు 31న (మంగళవారం) జరిగిన విలేకరుల సమావేశంలో భారత వాతావరణ శాఖ సెప్టెంబర్ నెలకు సంబంధించి వాతావరణ అంచనాలను వెల్లడించింది.

సెప్టెంబరులో దేశవ్యాప్తంగా సాధారణంగా కురిసే వర్షపాతంలో 91శాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. అయితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండదు. 1971-2020 నుంచి దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లు.

వాయువ్య, ఈశాన్య, తూర్పు, తూర్పు-మధ్య, ఆగ్నేయ భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ లేదా సాధారణం కంటే కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి?

వర్షాలు తక్కువగా పడడం వల్ల వేడి పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సెప్టెంబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది.

చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వాయువ్య, పశ్చిమ-మధ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు దీనికి మినహాయింపు కావచ్చు.

వర్షాలు, ఎండలు, ఎల్‌నినో, సెప్టెంబర్
ఫొటో క్యాప్షన్, రాబోయే నెలల్లో ఎల్‌నినో తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది.

ఎల్‌ నినో పరిస్థితి ఏంటి?

భూమధ్యరేఖకు దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలమైన ఎల్‌నినో పరిస్థితి నెలకొని ఉందని ఐఎమ్‌డీ తెలిపింది.

రాబోయే నెలల్లో ఎల్‌ నినో తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

హిందూ మహాసముద్రంలోని ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) ప్రస్తుతం తటస్థంగా ఉంది. ఈ పరిస్థితి సెప్టెంబర్‌లో కూడా కొనసాగుతుందని ఐఎండీ వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.

కొన్ని అంతర్జాతీయ వాతావరణ కేంద్రాల అంచనాల మేరకు సెప్టెంబర్ నుంచి ఐఓడీ సానుకూలంగా మారొచ్చు.

వర్షాలు, ఎండలు, ఎల్‌నినో, సెప్టెంబర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెప్టెంబరులో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది.

తక్కువ వర్షాలు-ఎక్కువ ఉష్ణోగ్రతలు

సెప్టెంబర్ నైరుతి రుతుపవనాల చివరి నెల కాబట్టి ఈ నెలలో కురిసే వర్షాలు వ్యవసాయం, నీటి నిల్వల పరంగా చాలా ముఖ్యమైనవి.

సాధారణం కంటే తక్కువ వర్షాలు పడితే వ్యవసాయం, నీటి లభ్యత, జలవిద్యుత్ ఉత్పత్తి, పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో వేడి ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మొత్తంగా చూస్తే సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా పరిస్థితి మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉండగా మరోవైపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వర్షాలు, ఎండలు, ఎల్‌నినో, సెప్టెంబర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ నెల ఏడు వరకు కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ఎలా ఉంటుంది?

సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాధారణం కంటే తక్కు వ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ చేసింది.

ఈ నెల ఏడు వరకు కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ నెల ఐదు వరకు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.

ఈ సమయంలో గంటకు 40నుంచి50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)