భారత్‌ను దాటిపోయిన తైవాన్, ఏ విషయంలో అంటే...

తైవాన్ టీఎస్‌ఎంసీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

స్టాక్ మార్కెట్ విలువ పరంగా భారత్‌ను తైవాన్ అధిగమించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ కంపెనీ తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) షేర్లు భారీగా పెరగడమే దీనికి కారణం.

స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను కలిపి స్టాక్ మార్కెట్ విలువ లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు.

ఉదాహరణకు.. భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ప్రస్తుతం 4.92 ట్రిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.4,70,88,508 కోట్లు.

స్టాక్ మార్కెట్ విలువపరంగా భారత్‌ను తైవాన్ అధిగమించినప్పటికీ.. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ, తైవాన్ జీడీపీ కంటే ఎక్కువే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 4.15 ట్రిలియన్ డాలర్లు (రూ.3,97,18,031 కోట్లు) కాగా.. తైవాన్ జీడీపీ 977 బిలియన్ డాలర్లు (రూ.93,50,735 కోట్లు).

ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి.

అయితే, 4.15 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్‌ను, 977 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న తైవాన్ అధిగమించిందని ఇక్కడ గమనించవచ్చు.

బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. సోమవారం తైవాన్ స్టాక్ మార్కెట్ మొత్తం విలువ 4.95 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్ల విలువ 4.92 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది.

అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ తర్వాత తైవాన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది.

ఆశ్చర్యకరంగా టాప్ 5లో దేశాల్లో మూడు చైనా, హాంకాంగ్, తైవాన్‌లే. చైనాలో స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం హాంకాంగ్. తైవాన్‌ను కూడా చైనా తన భూభాగంలో భాగంగానే పరిగణిస్తోంది.

ప్రపంచ ఈక్విటీ ర్యాంకింగ్‌లలో తైవాన్ గణనీయంగా ఎదగడానికి ప్రధాన కారణం టీఎస్ఎంసీ కంపెనీయే. దీనికి ఇప్పుడు తైవాన్ బెంచ్‌మార్క్ సూచీ తైఎక్స్‌లో(Taiex) సుమారు 42 శాతం వెయిటేజ్ ఉంది.

తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సీఈవో సీసీ వైయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సీఈవో సీసీ వైయ్ (ఫైల్ ఫోటో)

ఏఐ వల్ల భారీ పెరుగుదల

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వస్తున్న వృద్ధిని సద్వినియోగం చేసుకుంటూ.. ఏఐ సంబంధిత సెమీకండక్టర్ మార్కెట్‌లో బలమైన, దాదాపు ఆధిపత్య స్థానాన్ని పొందింది. దీంతో, ఈ ఏడాది టీఎస్ఎంసీ షేర్లు 49 శాతం లాభపడ్డాయి.

తైవాన్ స్టాక్ మార్కెట్ విలువలో వచ్చిన భారీ పెరుగుదల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత సానుకూల దృక్పథం ఉందో తెలియజేస్తుంది.

ఈ సానుకూల దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి. దీంతో తైవాన్, దక్షిణ కొరియాలకు చెందిన తయారీ హబ్‌లు ఎక్కువగా లబ్ది పొందుతున్నాయి.

మరోవైపు, పెరుగుతున్న ఇంధన ధరలు, కార్పొరేట్ లాభాలలో మందగమనం, ఏఐ రంగంలో నైపుణ్యం ఉన్న కంపెనీల కొరతతో భారత్ ఇబ్బంది పడుతోందని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో రాసింది.

''తైవాన్‌లో పెరుగుతున్న మార్కెట్ క్యాపిటలైజేషన్, టెక్నాలజీ హార్డ్‌వేర్ రంగంలో దాని బలమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఇది ఏఐ పెట్టుబడులకు కేంద్రబిందువుగా మారింది'' అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజర్ యి పింగ్ లియావో బ్లూమ్‌బర్గ్‌తో అన్నారు.

''తైవాన్, దక్షిణ కొరియా వంటి టెక్నాలజీ హార్డ్‌వేర్ ఆధిపత్య మార్కెట్లతో పోలిస్తే.. టెక్ హార్డ్‌వేర్ ఉనికి పరిమితంగా ఉన్న మార్కెట్లు ప్రస్తుతం వెనుకబడి పోతున్నాయి'' అని చెప్పారు.

ప్రస్తుతం ఆర్థిక నిబంధనలు కూడా టీఎస్ఎంసీకి అనుకూలంగా మారాయి. గత నెలలో తైవాన్ ఫైనాన్సియల్ రెగ్యులేటర్ (ఆర్థిక నియంత్రణ సంస్థ) దేశీయ ఫండ్‌లు ఒకే స్టాక్‌లో పెట్టుబడి పెట్టగల గరిష్ఠ షేర్ల పరిమితిని పెంచింది.

కొత్త మార్గదర్శకాల కింద.. తైవాన్‌ స్టాక్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే ఫండ్‌లు.. ప్రస్తుతం వారి మొత్తం ఆస్తుల్లో 25 శాతం వరకు, తైఎక్స్ ఇండెక్స్‌లో 10 శాతం కంటే ఎక్కువ వెయిటేజీ ఉన్న ఏ లిస్టెడ్ స్టాక్‌లోనైనా పెట్టుబడిగా పెట్టొచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం 10 శాతంగానే ఉండేది.

ప్రస్తుతం ఈ ప్రమాణాలకు టీఎస్ఎంసీ మాత్రమే అనుగుణంగా ఉంది. ఈ మార్పుతో తైవాన్‌లోకి కొత్తగా 6 బిలియన్ డాలర్లకు పైగా (రూ.57,422 కోట్లకు పైగా) పెట్టుబడులు రాగలవి జేపీ మోర్గాన్ చేజ్ అంచనావేస్తోంది.

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

'పరిస్థితి మరీ దారుణం'

విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది పెద్ద ఎత్తున భారత స్టాక్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. షేర్ ధరలు ఎక్కువగా ఉండటం, రూపాయి విలువ బలహీనపడటం, ఇంధన ధరలు పెరుగుతుండటమే దీనికి కారణంగా చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుంచి సుమారు 24 బిలియన్ డాలర్లను (రూ.2,29,812 కోట్లను) ఉపసంహరించుకున్నారు.

విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా ఏఐ స్టాక్స్‌పైనే దృష్టి సారించారు. ప్రస్తుతం భారత్‌కు అంత బలమైన ఏఐ ప్రత్యామ్నాయం లేదు.

భారత ప్రధాన స్టాక్ ఇండెక్స్ సెన్సెక్స్ ఈ ఏడాది సుమారు 10 శాతం మేర పడిపోయింది. ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భారత వాటా గత ఏడాది 19 శాతం నుంచి ప్రస్తుతం 12 శాతానికి క్షీణించింది.

కేవలం రెండేళ్ల కిందటే హాంకాంగ్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా భారత్‌ అవతరించింది. కానీ రెండేళ్ల తర్వాత, హాంకాంగ్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉండగా, తైవాన్ కూడా భారత్‌ను అధిగమించింది.

దక్షిణ కొరియా త్వరలో భారత్‌ను అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు. ఏఐ రేసులో భారత్ ఇప్పటికే వెనుకబడిందని చెబుతున్నారు.

''దాదాపు ప్రపంచమంతా ఏఐపైనే దృష్టిపెట్టడంతో.. మూలధనం ఇప్పుడు భారత్ నుంచి తరలి వెళుతోంది'' అని ఆంగ్ల పత్రిక 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఈ నెల మొదట్లో ప్రపంచ పెట్టుబడిదారుడు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు రుచిర్ శర్మ చెప్పారు.

''ప్రపంచ ఏఐ పోటీపై పెట్టుబడిదారులు అమితమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ రేసులో భారత్‌ను ఒక బలహీనమైన దేశంగా పరిగణిస్తున్నారు'' అని అన్నారు.

''గత కొన్నేళ్లుగా భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు 50 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. నికర ఎఫ్‌డీఐలు కూడా దాదాపు జీరోగా ఉన్నాయి. నా 30 ఏళ్ల పెట్టుబడుల అనుభవంలో భారత్‌ విషయంలో ఇంత ఉదాసీనత నేనెప్పుడూ చూడలేదు. 2013లోని ''ఫ్రాజైల్ ఫైవ్'' రౌండ్‌ సమయంలో భారత పట్ల ఈ ప్రతికూలత కనిపించింది. కానీ, నేడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెట్టుబడిదారులు ఏఐపైనే దృష్టిపెట్టారు. ఈ విషయంలో భారత బలహీనత ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది'' అని రుచిర్ శర్మ అన్నారు.

బేర్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న విదేశీ పెట్టుబడిదారులు

భారత్ ఎందుకు వెనుకబడింది?

''పరిశోధనలపై భారత్ తన జీడీపీలో కేవలం 0.6 శాతమే ఖర్చు చేస్తుండగా.. దక్షిణ కొరియా, తైవాన్‌లు నాలుగు నుంచి ఐదు శాతం ఖర్చు చేస్తున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన ఐటీ రంగం చాలాకాలంగా చౌకగా లభించే లేబర్, అవుట్‌సోర్సింగ్ మోడల్‌పైనే ఆధారపడింది తప్ప.. ఆవిష్కరణలు, నూతన సాంకేతిక అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. ఇప్పుడు, ఈ బలహీనత ఒక పెద్ద సవాలుగా మారింది" అని రుచిర్ శర్మ అన్నారు.

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డి. సుబ్బారావు మే 20న ఆంగ్ల వార్తా పత్రిక హిందూస్తాన్ టైమ్స్‌కు రాసిన కథనంలో.. టెక్నాలజీ విషయంలో భారత్ వెనుకబడిందని పేర్కొన్నారు.

‘‘భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ.. ఈ అత్యాధునిక సాంకేతిక రంగాలలో భారత్ పాత్ర మాత్రం పరిమితంగా కనిపిస్తోంది. ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు ప్రవహించే కొద్దీ, రూపాయిపై ఒత్తిడి కచ్చితంగా పెరుగుతుంది" అని సుబ్బారావు రాశారు.

"భారత విదేశీ మారక నిల్వలు సుమారు 700 బిలియన్ డాలర్లు (రూ.66,98,324 కోట్లుగా). ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల్లో ఒకటి. కానీ, దీనివల్ల ఆత్మవిశ్వాసం అతిగా పెరగకూడదు. సాధారణ సమయాల్లో ఈ మొత్తం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ, సంక్షోభ సమయాల్లో దీని అసలు విలువ దాని విశ్వసనీయతపైనే ఆధారపడి ఉంది" అని సుబ్బారావు రాశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)