అమెరికా: భారత్ సహా 60 దేశాలపై అదనపు సుంకాలను ఎందుకు విధించాలని చూస్తోంది?

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images
భారత్‌తో సహా 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధుల విభాగం( అమెరికా ట్రేడ్ రిప్రజెంటిటివ్స్) ప్రతిపాదించింది.
అమెరికా వాణిజ్య ప్రతినిధుల విభాగం (యూఎస్‌టీఆర్) తన సెక్షన్ 301 దర్యాప్తు నివేదికను మంగళవారం విడుదల చేసింది. ఈ దేశాలు వస్తువుల ఉత్పత్తిలో ఫోర్స్‌డ్ లేబర్ (బలవంతంగా పని చేయించుకోవడం)ను నిర్మూలించడంలో విఫలమయ్యాయని ఆ నివేదిక పేర్కొంది.
వాణిజ్య ఒప్పందం గురించి చర్చించేందుకు అమెరికాకు చెందిన ఒక బృందం మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
''మా ప్రధాన వాణిజ్య భాగస్వాములలో చాలా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై కనీసం 10 శాతం సుంకాలు వేయాలని ప్రతిపాదిస్తున్నాం. ఆయా దేశాల్లో తయారయ్యే వస్తువులలో ఫోర్స్‌డ్ లేబర్‌ను వాడుతున్నట్లు మా విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని యూఎస్‌టీఆర్ తన ప్రకటనలో పేర్కొంది.
అమెరికా సుంకాలు ప్రతిపాదించిన దేశాలలో చైనా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, హాంకాంగ్‌లతోపాటు మరికొన్ని దేశాలున్నాయి.

అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన విస్తృత సుంకాల విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తిరిగి విధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన చేసినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. 2025 ఏప్రిల్ 2న, భారత్‌తో సహా ప్రపంచంలోని 100 దేశాలపై పరస్పర సుంకాలను విధిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
అమెరికా వస్తువులపై ఒక దేశం అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తే, ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అమెరికా కూడా అధిక సుంకాలు విధిస్తుందని ట్రంప్ అప్పుడు పేర్కొన్నారు. ఆయన దీనిని "పరస్పర సుంకాలు (రెసిప్రొకల్ టారిఫ్స్)"గా అని అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ట్రంప్ గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కీలక పాలనా విధానానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా కనిపించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
యూఎస్‌టీఆర్ ప్రకటనలో ఏముంది?
''1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద, బలవంతపు కార్మిక విధానాలు అవలంబిస్తూ తయారు చేసిన వస్తువులపై దిగుమతి ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంలో 60 ఆర్థిక వ్యవస్థలు విఫలమయ్యాయని తేలింది" అని యూఎస్‌టీఆర్ విభాగం తన ప్రకటనలో పేర్కొంది.
''ఇది అసలు సమర్థించే విషయం కాదు. అమెరికా వ్యాపారాలకు భారం. ఇది, వాణిజ్య చట్టానికి చెందిన సెక్షన్ 301(బీ) కింద చర్య తీసుకునే విషయమే'' అని తెలిపింది.
అమెరికా తన మొత్తం దిగుమతులలో 99.40 శాతం ఈ 60 దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది.
''ఉత్పత్తిలో బలవంతపు కార్మిక విధానాలకు సంబంధించి దిగుమతి ఆంక్షలను వివిధ ఆర్థిక వ్యవస్థలు సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలం కావడం'' మీద ఒక వివరణాత్మక నివేదికను యూఎస్‌టీఆర్ సిద్ధం చేసింది.
"మా అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు ‘బలవంతపు కార్మిక విధానాలను అమలు చేస్తూ తయారు చేసిన వస్తువుల దిగుమతి సమస్య’ ను పరిష్కరించడంలో విఫలం కావడం ఆమోదయోగ్యం కాదు" అని యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ అన్నారు.
''అమెరికా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఈ అసమానతను మేం ఇక సహించబోం'' అని చెప్పారు.
మంగళవారం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధుల విభాగం ప్రతిపాదించింది.
అయితే, ఫెడరల్ రిజిస్టర్ నోటీసు అనెక్స్ ఏ లో అందించిన మినహాయింపులు అమల్లో ఉంటాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఏం దేశాలపై ఎంత సుంకం?
అమెరికా వాణిజ్య ప్రతినిధుల విభాగం విడుదల చేసిన నివేదికలో.. భారత్‌తో సహా 54 దేశాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఫోర్స్‌డ్ లేబర్‌తో తయారైన వస్తువుల దిగుమతిపై చట్టపరమైన ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొంది.
అదేవిధంగా ఆరు దేశాలు ఈ చట్టపరమైన నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలయ్యాయి. ఆ దేశాలు కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్.
కెనడా, ఈయూ, బ్రిటన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, కాంబోడియా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, మలేషియా, తైవాన్‌ల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించనున్నామని ఈ వాణిజ్య విభాగం తెలిపింది.
అలాగే, భారత్, చైనాలను కలుపుకుని మిగిలిన 45 దేశాలు 12.5 శాతం డ్యూటీలను ఎదుర్కోనున్నాయి.
సెక్షన్ 301 కింద చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక ఏర్పాటును ఈ వాణిజ్య విభాగం ప్రతిపాదించింది. దీని కింద, తక్కువ టారిఫ్ రేటు కింద అమెరికాలోకి ఈ ఆర్థిక వ్యవస్థలకు చెందిన అప్పీరల్, టెక్స్‌టైల్ ప్రొడక్టులను అనుమతించనుంది.
ఈ కొత్త సుంకాలు వెంటనే అమల్లోకి రావడం లేదని సంస్థ పేర్కొంది. అమల్లోకి తెచ్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణను, సమీక్షను చేపడతామని తెలిపింది.
భారత స్పందనేంటి?
కొత్త సుంకాల ప్రతిపాదనపై భారత వాణిజ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
"కొన్ని వస్తువుల దిగుమతిని పరిమితం చేయడానికి భారత్‌తో సహా 60 ఆర్థిక వ్యవస్థలు అమలు చేసిన చర్యలకు సంబంధించి యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తన దర్యాప్తును పూర్తి చేసింది. ఈ దర్యాప్తు ఆధారంగా, 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ 60 దేశాల నుంచి దిగుమతులపై అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించింది'' అని భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.
''సెక్షన్ 232 కింద ఇప్పటికే సుంకాలకు లోబడి ఉన్న ఉత్పత్తులు, నిర్దిష్ట ఇతర వస్తువులకు ఈ ప్రతిపాదిత సుంకం నుంచి మినహాయింపు ఉంది'' అని చెప్పింది.
''టెక్స్‌టైల్, అప్పీరల్ ప్రొడక్టుల కోసం కూడా ఒక ప్రత్యేక ఏర్పాటును ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ఎంపిక చేసిన దేశాల నుంచి కొంత మొత్తంలో దిగుమతులను తక్కువ సుంకం రేటుతో అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతించవచ్చు'' అని చెప్పింది. సెక్షన్ 301 ప్రక్రియకు సంబంధించి భారత్ అమెరికాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























