‘వన్డేల్లో వారికి చోటు ఇవ్వకపోవడం అన్యాయమే’: యువరాజ్ సింగ్

ఫొటో సోర్స్, Carlos Alvarez/Getty Images for Laureus
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు వన్డే జట్టులో రెగ్యులర్ స్థానం ఇవ్వకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ముంబయిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ , "నిజం చెప్పాలంటే, అభిషేక్ శర్మ వన్డేలు ఆడటం చూడాలని కోరుకుంటున్నా. ఇషాన్ కిషన్, అభిషేక్ వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట మనం వారి ప్రతిభకు న్యాయం చేయడం లేదని అర్థం అని నేను గతంలోనే చెప్పా’’ అన్నారు.
"మన దగ్గర కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. , వారికి జట్టులో స్థానం సంపాదించడం కష్టమని నాకు తెలుసు. కానీ ఈ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తుంటే, వారికి త్వరలోనే జట్టులో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నా" అన్నారు.
ఈ ఆటగాళ్లు సాధించినదంతా వారి కఠోర శ్రమతోనే సాధ్యమైందని, ఆ ఘనత వారికే దక్కుతుందని యువరాజ్ అన్నారు.









