ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే అవకాశం- విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

గురువారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షాల కారణంగా వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించద్దని ప్రఖర్ జైన్ సూచించారు. విపత్తు పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.











