పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ- మంత్రి గొట్టిపాటి రవి ప్రకటన

ఫొటో సోర్స్, @ravi_gottipati
అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటల నష్టాలను తక్షణమే అంచనా వేసి, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రిగొట్టిపాటి రవి ప్రకటించారు.
తుపాను సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, దెబ్బతిన్న 3,700 విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేపట్టి, విద్యుత్ అంతరాయం ఏర్పడిన సుమారు 400 గ్రామాలకు గురువారం సాయంత్రంలోగా సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటంతోపాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేసినట్టు తెలిపారు.













