లైవ్, తుపాను సమయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలంటే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సారాంశం

  • సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమైన ఆదివారం నాడే మరోసారి రియాద్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
  • హూతీ తిరుగుబాటు దారులు పదేపదే దాడులకు పాల్పడినట్టు కథనాలు వచ్చిన తరువాత రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు వారాలపాటు మూసివేశారు.
  • కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 1న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్‌లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
  • రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
  • ఫ్రాన్స్‌లో శనివారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
  • ఈ ఘటనలకు సంబంధించి దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. 2 వారాల తరువాత తెరుచుకున్న రియాద్ ఎయిర్‌పోర్ట్, హూతీల హెచ్చరికలు ఏమిటి?

    కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికీ సురక్షితం కాదని హూతీలు హెచ్చరిస్తున్నారు
    ఫొటో క్యాప్షన్, కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికీ సురక్షితం కాదని హూతీలు హెచ్చరిస్తున్నారు

    సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమైన ఆదివారం నాడే మరోసారి రియాద్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

    హూతీ తిరుగుబాటు దారులు పదేపదే దాడులకు పాల్పడినట్టు కథనాలు వచ్చిన తరువాత రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు వారాలపాటు మూసివేశారు.

    ఆదివారం తెల్లవారుజామున ఒక విమానం ఇక్కడి నుండి టేకాఫ్ అయినట్లు ప్రపంచవ్యాప్తంగా విమానాల కదలికలను ట్రాక్ చేసే 'ఫ్లైట్‌రాడార్' వెబ్‌సైట్ పేర్కొంది.

    అయితే, రాజధాని రియాద్‌లో తాజాగా జరిగిన ఈ పేలుడుకు గల కారణాలపై సౌదీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

    మరోవైపు, కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమకు ఇప్పటికీ "సురక్షితం కానిది" "సైనిక లక్ష్యం" అని హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ, "విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వల్ల జరిగే పరిణామాలకు సౌదీ అరేబియానే బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని పేర్కొన్నారు.

    కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినప్పటి నుండి హూతీ తిరుగుబాటుదారులు ఈ విమానాశ్రయాన్ని పలుమార్లు లక్ష్యంగా చేసుకున్నారు.

    ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక దాడిలో 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

  2. ‘తుపాను వస్తోంది ఈ జాగ్రత్తలు తీసుకోండి’ - ఏపీఎస్‌డీఎంఏ, గరికిపాటి ఉమాకాంత్‌

    ఏపీ, తుపాను
    ఫొటో క్యాప్షన్, తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

    దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

    వర్షాల అంచనా:

    • ఆదివారం - 25-10-2026): కృష్ణా, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
    • మంగళ, బుధవారాలు: చెదురుమదురుగా అత్యంత భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

    అత్యవసర సహాయ నంబర్లు: ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఏవైనా అత్యవసర సహాయాలు లేదా సమాచారం కోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

    ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

    • విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్, ఐఎండి పంపే వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
    • విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలి.
    • కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు సిద్ధం చేసుకోవాలి.
    • ఇంటి పైకప్పు, తలుపులు, కిటికీలు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.
    • తుపాను సమయంలో ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించాలి.
    • ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
    • లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన, సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలి.
    • మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాడులతో గట్టిగా కట్టాలి.
  3. బీజేపీకి రాహుల్ థాంక్స్, ‘ఈ 7రోజులు అదే ఉత్సాహంతో ఉండండి’

    నవంబర్ 1న ర్యాలీలో పాల్గొనాలని రాహుల్ కోరారు
    ఫొటో క్యాప్షన్, నవంబర్ 1న ర్యాలీలో పాల్గొనాలని రాహుల్ కోరారు

    కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 1న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    సర్‌లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.

    ఈ విషయమై రాహుల్ గాంధీ ఆదివారం 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. "మా ఓట్లను దొంగిలిస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీఛార్జ్ చేశారు." అని రాశారు.

    విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారవేత్తలు—ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 1న జరిగే ర్యాలీకి తప్పక రావాలి. ఓటు మీదే. పోరాటం మీదే అని పిలుపునిచ్చారు.

    "ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ప్రచారం చేసి, వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేసినందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి!" అని రాహుల్ రాశారు.

    మరోవైపు, నవంబర్ 10 తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది.

    రద్దీగా ఉండే దీపావళి షాపింగ్ సీజన్‌లో ఈ ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని వాణిజ్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

  4. ఫ్రాన్స్‌: నిరసనలు, ఘర్షణలు,దాదాపు వెయ్యి మంది అరెస్ట్

    ఫ్రాన్స్‌, భారీ ఎత్తున నిరసనలు
    ఫొటో క్యాప్షన్, పారిస్ సహా పలు నగరాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

    ఫ్రాన్స్‌లో శనివారం నాటి నిరసనలు, ఘర్షణలకు సంబంధించి దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

    శనివారం పగటిపూట నిరసనలు చాలావరకు శాంతియుతంగా సాగాయి. అయితే, పారిస్ సహా పలు నగరాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వాటర్ కానన్లను ఉపయోగించారు.

    మార్సెయ్ నగరంలో నిరసనకారులు రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు నిప్పుపెట్టారు. బోర్డో నగరంలో ఓ దుకాణానికి అమర్చిన చెక్క పలకలను కొందరు తొలగించారు.

    అయితే, గత వారాంతంలో జరిగిన స్థాయిలో అల్లర్లు, దోపిడీలు జరగకుండా అధికారులు ఇప్పటివరకు నియంత్రించగలిగారు.

    శనివారం జరిగిన నిరసనల్లో సుమారు 4.10 లక్షల మంది పాల్గొన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

    అయితే, ఈ సంఖ్య దాదాపు 8 లక్షలుగా ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

    ఫ్రాన్స్‌, భారీ ఎత్తున నిరసనలు
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌‌లో జీవన వ్యయం పెరగడం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి.

    జీవన వ్యయం పెరగడం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 70 వేల మంది పోలీసులను మోహరించారు. పలు నగరాల్లో ఆంక్షలు విధించారు.

    గతంలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల సంఖ్య కంటే ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. వందలాది వ్యాపార సంస్థల్లో దోపిడీలు జరిగాయి. భవనాలకు నిప్పుపెట్టారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

    గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్వహించే ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ వారం ప్రారంభంలోనే ఆదేశాలు జారీ చేశారు.

  5. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.