గుడ్ నైట్
లైవ్ పేజ్ వార్తలను ఇంతటితో ముగిస్తున్నాం. ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు.
హ్వాంగ్ను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ రూపొందించిన బహిరంగ లేఖపై 1,75,000 మందికి పైగా సంతకాలు చేశారు.
లైవ్ పేజ్ వార్తలను ఇంతటితో ముగిస్తున్నాం. ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హ్వాంగ్కు తిరిగి ఆ పదవి దక్కినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు డొోనల్డ్ ట్రంప్ అన్నారు.
హ్వాంగ్ను మళ్లీ సీఈఓగా నియమించాలని ఆయన సన్నిహితులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఏఐ చిప్‌ల తయారీలో దిగ్గజ సంస్థ అయిన ఎన్విడియా సీఈఓ పదవికి హ్వాంగ్ గత వారం రాజీనామా చేశారు.
ఇద్దరు మహిళలతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీరిలో ఒక మహిళ చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారని, మరో మహిళ ఎన్విడియాలోనే ఉద్యోగినిగా పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా సంక్షోభంలో పడింది.
అయితే ఇప్పుడు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఫోర్ట్‌నైట్ గేమ్‌ను రూపొందించిన ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు హ్వాంగ్ తిరిగి ఆ పదవి ఇవ్వొచ్చంటూ మద్దతుగా నిలిచారు.
హ్వాంగ్ను మళ్లీ కంపెనీ అధినేతగా నియమించాలని ఎన్విడియా డైరెక్టర్ల బోర్డును వారు కోరారు.
హ్వాంగ్ను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ రూపొందించిన బహిరంగ లేఖపై 1,75,000 మందికి పైగా సంతకాలు చేశారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు హ్వాంగ్ను మళ్లీ సీఈఓగా నియమించాలని ఆ లేఖలో కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
హ్వాంగ్ భవిష్యత్తుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మాజీ సీఈఓకు తిరిగి ఆ పదవి దక్కితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
"ఒక పాఠం మరొకదాని కంటే ఎక్కువ ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. అయితే ఆయన మళ్లీ ఆ పదవిలోకి వస్తే నాకు కచ్చితంగా అభ్యంతరం ఉండదు" అని ట్రంప్ విలేఖరులతో అన్నారు.
గత వారం హ్వాంగ్ పదవి నుంచి తప్పుకోవడంతో కోలెట్ క్రెస్‌ను ఎన్విడియా తాత్కాలిక సీఈఓగా నియమించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
కీలకమైన బాబ్ అల్ మందెబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతం నుంచి తమ బలగాలు వెనక్కి వెళ్తున్నాయని యెమెన్ ప్రభుత్వానుకూల సైన్యం ప్రకటించింది.
దీంతో ఆ ప్రాంతం ఇరాన్ మద్దతున్న హూతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లింది.
ఎర్ర సముద్రం దక్షిణంవైపు చివరన ఉన్న ఈ కీలక సముద్ర మార్గం నుంచి తమ సైనికులను వెనక్కి రప్పించి, తాత్కాలిక రాజధాని అదెన్కు రక్షణ కల్పించేందుకు వారిని మోహరిస్తున్నట్లు యెమెన్ సైన్యం తెలిపింది.
ఈ నిర్ణయంతో ఆ ప్రాంతంపై నియంత్రణ సాధించేందుకు గత కొన్ని వారాలుగా జరుగుతున్న సైనిక ఆపరేషన్ ముగిసింది.
హూతీ తిరుగుబాటుదారులు సెప్టెంబర్‌లో ఆకస్మికంగా దాడి చేసి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
దీంతో ప్రపంచంలోని వివిధ దేశాలకు చమురు ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది.
ఆదివారం తర్వాత హూతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని మీడియా సంస్థలు ఈ మొత్తం ప్రాంతాన్ని తమ గ్రూప్ స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు ప్రసారం చేశాయి.
ఈ పరిణామంపై సౌదీ అరేబియా స్పందించలేదు.

ఫొటో సోర్స్, Amirhossein KHORGOOEI / ISNA / AFP via Getty Images
సముద్రంలో అమర్చిన మందుపాతరను ఢీకొనడంతో మరో చమురు ట్యాంకర్ మంటల్లో చిక్కుకుందని ఇరాన్ నౌకాదళం పేర్కొంది.
సోమవారం ఉదయం హార్ముజ్ జలసంధికి తూర్పున ఉన్న సముద్ర ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఇరాన్ నౌకాదళం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నౌక నిబంధనలు ఉల్లంఘించినట్టు పరిగణిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది.
హార్ముజ్ జలసంధికి తూర్పు వైపున నౌకల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వాటిపై తమ నియంత్రణ ఉందని ఇరాన్ నౌకాదళం తెలిపింది.
ఇంతకుముందు హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లు సముద్రంలోని మందుపాతరలను ఢీకొనడంతో మంటలు చెలరేగాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) పేర్కొంది.
ఆదివారం నుంచి ఇప్పటివరకు హార్ముజ్ జలసంధిలో ఆరు చమురు ట్యాంకర్లలో మంటలు చెలరేగాయని ఐఆర్జీసీ తెలిపింది.

ఫొటో సోర్స్, Sanaullah SEIAM / AFP via Getty Images
ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్లో రేడియో స్టేషన్లపై తాలిబన్ ప్రభుత్వాధికారులు ఆంక్షలు విధించారు. క్రికెట్ కంటెంట్ ప్రసారం చేయొద్దని నిషేధించారు.
రెండు రేడియో స్టేషన్ల అధికారులు, ప్రాంతీయ వర్గాలు దీన్ని ధ్రువీకరించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొన్నట్టు బీబీసీ ఉర్దూ పేర్కొంది.
కాందహార్ తాలిబన్ నాయకుడు ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా స్వస్థలం. తాలిబన్ ప్రభుత్వం గతంలో క్రికెట్‌కు మద్దతు ఇచ్చింది.
ఆయన తిరిగి అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా క్రికెట్ మ్యాచ్‌లను కూడా నిర్వహించారు.
కానీ ఇప్పుడు క్రికెట్ కంటెంట్‌ను ఇకపై ప్రసారం చేయొద్దని రేడియో స్టేషన్లకు కాందహార్ సమాచార, సాంస్కృతిక శాఖ శనివారం చెప్పినట్టు ఏఎఫ్‌పీ తెలిపింది.
ఇది నిజమేనని పేరు వెల్లడించకూడదనే షరతుపై ఆ శాఖ అధికారి ఒకరు ఏఎఫ్పీకి స్పష్టం చేశారు.
మ్యాచ్‌ల వ్యాఖ్యానమే కాకుండా, క్రికెట్ వార్తల ప్రసారం, మ్యాచ్‌ల్లో విజయాలను రిపోర్ట్ చేయకూడదని కూడా నిషేధం విధించినట్టు ఆయన పేర్కొన్నారు.
ఇకపై రేడియోలో క్రికెట్ కంటెంట్ ప్రసారం చేయొద్దని సమాచార, సాంస్కృతిక శాఖ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని స్థానిక రేడియో స్టేషన్ అధిపతి ఒకరు ఏఎఫ్పీకి చెప్పారు. ఈ నిషేధం ఎందుకు చేస్తున్నారనే విషయం గురించి స్పష్టత లేదని పేర్కొన్నారు.
యూఏఈలోని షార్జాలో ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు జింబాబ్వేతో రెండో టెస్టు ఆడుతున్న సమయంలో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.
తాలిబన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంఎంఏతో సహా కొన్ని యుద్ధ కళలు, క్రీడా కార్యకలాపాలను నిషేధించింది. అయితే, అబ్బాయిలు క్రికెట్ ఆడటానికి అనుమతి ఉంది. మహిళలు, బాలికలను క్రీడలలో పాల్గొనడానికి, క్రీడా క్లబ్‌లకు వెళ్లడానికి లేదు.

ఫొటో సోర్స్, Gareth Copley/Getty Images
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్‌గా జయ్ షా రెండోసారి ఎన్నికయ్యారు. బాలిలో జరిగిన బోర్డు, కమిటీ సమావేశాల్లో ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) జయ్ షాను రెండోసారి తన ఛైర్మన్‌గా నియమించింది. ఆయన ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బాలిలో జరిగిన బోర్డు, కమిటీ సమావేశాల్లో జయ్ షాను రెండోసారి ఛైర్మన్‌గా నియమించాలని ఐసీసీ డైరెక్టర్లు ప్రతిపాదించినట్లు ఐసీసీ తెలిపింది .
ఈ నిర్ణయం జయ్ షా నాయకత్వంపై తమకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని, క్రికెట్ భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కొనసాగించడానికి ఇది తోడ్పడుతుందని ఐసీసీ బోర్డు పేర్కొంది.
"ఐసిసి బోర్డు నాపై ఉంచిన నమ్మకానికి నేను గౌరవంగా భావిస్తా. వారి విశ్వాసానికి, మద్దతుకు నేను డైరెక్టర్లందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా" అని జయ్ షా అన్నారు.
ఐసీసీ ఛైర్మన్‌గా పనిచేయడం గౌరవంగానే కాకుండా బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు.
38 ఏళ్ల జయ్ షా గతంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శిగా పనిచేశారు. ఆయన డిసెంబర్ 2024లో ఐసిసి ఛైర్మన్ పదవిని చేపట్టారు.

ఫొటో సోర్స్, Paul Faith / AFP via Getty Images
కీలకమైన అమెరికా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు నెమ్మదించడంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సర్వీస్ ఇప్పటికీ చాలా చాలా తక్కువ వేగంతో పనిచేస్తోందని, దీనివల్ల రష్యా దాడులు తిప్పికొట్టడం కష్టంగా ఉందని ఆదివారం అన్నారు.
"ఈ ఆంక్షలను ఎత్తివేస్తారని ఆశిస్తున్నాం. ప్రజల ప్రాణాల భద్రత, యుక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాల భద్రత దీనిపైనే ఆధారపడి ఉన్నాయి," అని ఆయన అన్నారు.
స్టార్‌షీల్డ్ వ్యవస్థ పనితీరు మందగించడం గురించి గత కొన్ని వారాలుగా చర్చ జరుగుతోంది. స్టార్‌షీల్డ్ అనేది ఎలాన్ మస్క్ కంపెనీ అందిస్తున్న స్టార్‌లింక్ సేవకు సైనిక అవసరాల కోసం రూపొందించిన ప్రత్యేక వెర్షన్. దీన్ని అమెరికా ప్రభుత్వం యుక్రెయిన్‌కు అందిస్తోంది.
అమెరికా ప్రభుత్వం, మస్క్ కంపెనీతో సమన్వయం చేసుకోవాలని తాను అధికారులకు సూచించినట్టు జెలియెన్‌స్కీ చెప్పారు. “చరిత్రలో సరైన పక్షాన నిలబడటం ముఖ్యం” అని ఆయన అన్నారు.
ఈ విషయంపై వైట్ హౌస్, స్టార్లింక్ల నుంచి బీబీసీ స్పందన కోరింది.
యుక్రెయిన్ యుద్ధరంగంలో సమాచార మార్పిడి కోసం ప్రామాణిక స్టార్‌లింక్ సేవను ఉపయోగిస్తుండగా, తన గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డగించడానికి స్టార్షీల్డ్ను ఉపయోగిస్తుంది.
ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటనల మధ్య వైరుధ్యాలతో, వేగ పరిమితుల అంశం అక్టోబర్‌లో తొలిసారిగా తెరపైకి వచ్చింది.
స్టార్షీల్డ్ను అమెరికా ప్రభుత్వం నియంత్రిస్తుందని, అందువల్ల దానికి అదే బాధ్యత వహించాలని మస్క్ అన్నారు.
అయితే, ట్రంప్ దీనిని ఖండించారు, సేవలను మునుపటిలాగే పునఃప్రారంభించాలని మస్క్‌ను కోరినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటు గ్రూపు అన్సార్ అల్లా ఆదివారం సాయంత్రం ప్రకటించింది.
రెండు బాలిస్టిక్ క్షిపణులతో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ అధికారులు ఇంకా దీనిపై స్పందించలేదు.
రియాద్ సమీపంలోని సౌదీ అరేబియా 'తూర్పు-పశ్చిమ' చమురు పైప్‌లైన్‌కు చెందిన రెండు పంపింగ్ స్టేషన్లపై కూడా తమ బృందం డ్రోన్ దాడులు చేసిందని హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ తెలిపారు.
మక్కా, మదీనాల వైపు దూసుకువస్తున్న మూడు డ్రోన్లను కూల్చివేశామని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించిన తరుణంలో ఈ వాదన వెలుగులోకి వచ్చింది.
కూటమి ప్రతినిధి తుర్కీ అల్-మాలికీ, హూతీలు మక్కాను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అయితే, యాహ్యా సరీ ఈ ఆరోపణను తోసిపుచ్చుతూ, సౌదీ అరేబియా వాదన "అసత్యమైంది, కల్పితమైంది" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, @Indiametdept
ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 6 గంటలుగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలింది.
నవంబర్ 16 ఉదయం 5:30 గంటల సమయానికి ఇది అండమాన్ నికోబార్ దీవులలోని శ్రీ విజయ పురానికి 680 కి.మీ, చెన్నైకి 720 కి.మీ, విశాఖపట్నానికి 820 కి.మీ, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 940 కి.మీ దూరంలో ఉంది.
ఇది ఉత్తర-వాయవ్య దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది. నవంబర్ 16 సాయంత్రానికి ఇది దక్షిణ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో 'తుపాను'గా బలపడవచ్చు. ఆ తర్వాత, నవంబర్ 17 సాయంత్రానికి ఇది పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో 'తీవ్ర తుపాను'గా మారే అవకాశం ఉంది. తదుపరి దశలో, ఇది మరింత బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ, నవంబర్ 19 రాత్రి సమయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతానికి 'అత్యంత తీవ్ర తుపాను' రూపంలో చేరుకునే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, @Indiametdept
ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో అల్పపీడనం గమనాన్ని వివరించింది.
‘గత 6 గంటలుగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలి, 'తీవ్ర అల్పపీడనం'గా బలపడింది. ఇది నవంబర్ 15, 2026 రాత్రి 11:30 గంటలకు అండమాన్ & నికోబార్ దీవులలోని శ్రీ విజయ పురానికి 670 కి.మీ, చెన్నైకి 760 కి.మీ, విశాఖపట్నానికి 870 కి.మీవ దూరంలో కేంద్రీకృతమై ఉంది’ అని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది ఉత్తర-వాయవ్య దిశగానే కొనసాగుతూ, నవంబర్ 16 సాయంత్రానికి దక్షిణ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో 'తుపాను'గా, నవంబర్ 17 సాయంత్రానికి 'తీవ్ర తుపాను'గా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆ తర్వాత, ఇది మరింత బలపడి, రాబోయే రెండు రోజుల్లో వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Amir Levy/Getty Images
ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన సన్నిహితులు ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఇజ్రాయెల్ మాజీ సైన్యాధిపతి గడి ఐజెన్కోట్ ఆరోపించారు.
నెతన్యాహు, ఆయన సన్నిహితుల వైఖరి ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష, తక్షణ ముప్పు అని ఆయన ఆరోపించారు.
నెతన్యాహు తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ సంస్థలను బలహీనపరిచారని, అన్ని హద్దులు దాటారంటూ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో రాశారు.
నెతన్యాహు ఒక్క నిమిషం కూడా ప్రధానమంత్రి పదవిలో ఉండకూడదని ఐజెన్కోట్ అన్నారు.
నెతన్యాహు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌లో స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కూడా ఆయన అన్నారు.
కూటమికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో తనకు ఇదే అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Al Drago/Getty Images
అమెరికాలో దేశవ్యాప్తంగా అనేక విమానాలను రద్దు చేసిన రెండు రోజుల తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడింది.
ఆదివారం వేల విమానాలు రద్దయ్యాయి, మరెన్నో ఆలస్యమయ్యాయి. సోమవారం విమాన సేవలు సాధారణ స్థితికి రావచ్చని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తెలిపారు.
"చాలా విమానాలు, వాటి సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాల్లో లేని పరిస్థితి. కాబట్టి పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది" అని ఆయన సీబీఎస్ న్యూస్‌తో అన్నారు.
ఆదివారం అమెరికాలో 8,800కు పైగా విమానాలు ఆలస్యం కాగా, 2,400 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.
విమాన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు అదనపు నిధులను ఆమోదించాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదివారం కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.
అమెరికా నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపివేయాలన్న నిర్ణయం తర్వాత శుక్రవారం దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నేను, బీబీసీ ప్రతినిధి ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.
ముఖ్యమైన వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. బీబీసీ న్యూస్ తెలుగు ముఖ్యమైన వార్తలను చదవడానికి కింది లింక్‌లపై క్లిక్ చేయండి.