షెఫాలీ వర్మ: మిథాలీ రాజ్ స్థానంలో 15 ఏళ్ల చిచ్చరపిడుగు ఎంపిక - ప్రెస్ రివ్యూ

షెఫాలీ వర్మ

ఫొటో సోర్స్, facebook/gurgaoncricketground

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

పొట్టి క్రికెట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ బ్యాట్స్‌వుమన్ మిథాలీరాజ్ స్థానంలో ఓ చిచ్చరపిడుగు అరంగేట్రం చేయనుందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. సెహ్వాగ్ తరహాలో మెరుపులు మెరిపించే 15 ఏళ్ల షెఫాలీ వర్మకు టీమిండియాలో చోటు దక్కింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహిళల టీ20 చాలెంజ్‌లో మిథాలీ సారథ్యంలోనే ఆడిన షెఫాలీ తన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. దేశవాళీ టోర్నీల్లోనూ దుమ్మురేపింది.

దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లోని ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచ్‌లకు షెఫాలీని ఎంపిక చేశారు. ఐదు అడుగులకన్నా కొద్దిగా ఎత్తుండే షెఫాలీ ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 చాలెంజ్‌లో విధ్వంసకర ప్రదర్శన చూపింది. అండర్-19, అండర్-23 విభాగాల్లో 150 పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇంగ్లండ్ ప్రముఖ క్రికెటర్ డేనియెల్ వ్యాట్ సైతం ఆమె ప్రతిభకు ముగ్ధురాలై 'ఓ సూపర్ స్టార్ తయారవుతోంద'ని ప్రశంసించింది. మహిళల క్రికెట్‌లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో అమ్మాయిగా షెఫాలీ నిలిచింది.

అంతకన్నా ముందు గ్రెయిగ్ బెనర్జీ 14 ఏళ్ల 165 రోజులకే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. 1978లో తొలి వన్డే ఆడింది. 1984లో తొలి టెస్టు ఆడింది. మొత్తంగా భారత్ తరఫున 12 టెస్టులు, 26 వన్డేలు ఆడింది.

మహిళల క్రికెట్‌లో 17 ఏళ్ల జెమీమా రోడ్సిగ్స్ సైతం సంచలన ఇన్నింగ్స్ ఆడుతోంది.

దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 24 నుంచి టీ20 సిరీస్, అక్టోబర్ 9 నుంచి వన్డే సిరీస్ ఆరంభమవుతాయి. టీ20లకు శాశ్వతంగా దూరమైన మిథాలీ వన్డే జట్టుకు సారథ్యం వహిస్తుంది. టీ20లకు హర్మన్ ప్రీత్ నాయకత్వం వహిస్తుంది. స్మృతి మంధానను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

యాదాద్రి

ఫొటో సోర్స్, Yadadri/Facebook

యాదాద్రి ఆలయంలో రాతి స్తంభాలపై కేసీఆర్‌ చిత్రాలు, కారు చిహ్నాలు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాతి స్తంభాలపై 'సారు.. కారు.. సర్కారు పథకాల'ను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చెక్కుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. యాదాద్రి ఆలయం లోపలికి వెళితే అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రం కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే.. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు 'కారు' చెక్కి ఉంటుంది. మరికాస్త ముందుకు వెళితే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్‌ కిట్‌, తెలంగాణకు హరితహారం తదితరాలూ రాతి స్తంభాలపై కనిపించనున్నాయి.

పురాతన ఆలయాల్లో శతాబ్దాల కాలం నాటి రాతి స్తంభాలపై చిహ్నాలు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. రాజుల కాలంనాటి నిర్మాణ రీతులతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఆలయంలోని కృష్ణ శిలలపై నేటి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు రాజకీయ అంశాలను కూడా పొందుపరుస్తున్నారు. ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రజల జీవన విధానం, ఆధునిక తెలంగాణ చరిత్రను రాతి స్తంభాలపై శాశ్వతపరుస్తున్నారు.

అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై ప్రస్తుతం చలామణీలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు పొందుపరిచారు. అలాగే, బతుకమ్మ వంటి పండుగలు, నాగలి దున్నే రైతు వంటి బొమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిక్షిప్తం చేశారు.

అష్టభుజి ప్రాకార మండపాల బాలపాద పిల్లర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌; టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు; ప్రభుత్వ పథకాలైన తెలంగాణకు హరితహారం, కేసీఆర్‌ కిట్‌; తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, తెలంగాణ చిత్రపటంలో చార్మినార్‌, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలి వంటి చిహ్నాలను చెక్కుతున్నారు.

మద్యపానం, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబుల కోసం త్వరలో డీఅడిక్షన్‌ సెంటర్లు

ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో అంచెలంచెల మద్యపాన నిషేధానికి ప్రభుత్వ ప్రయత్నం ప్రారంభమయ్యిందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నూతన ఎక్సైజ్‌ పాలసీని రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించామన్నారు. షాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

మద్యం షాపులను తగ్గించడమే కాక మద్యపాన ప్రియుల్లో పరివర్తన కోసం డీఅడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ స్వామి వెల్లడించారు.

ఈ మేరకు ఎక్సైజ్‌ అధికారులతో గురువార కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే నాటుసారా తయారిపై కూడా ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

విద్యుత్

ఫొటో సోర్స్, Getty Images

వారణాసిలో పాఠశాల కరంటు బిల్లు రూ. 618 కోట్లు.. కట్టకపోతే కట్ చేస్తామని హుకుం

సాధారణంగా ఒక పాఠశాలకు నెలవారీ విద్యుత్ బిల్లు రూ. వందల్లో లేదా వేలల్లో ఉంటుంది కానీ.. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌శాఖ అధికారులు ఓ ప్రైవేట్ స్కూల్‌కు ఏకంగా రూ. 618 కోట్ల కరంట్ బిల్లు వేశారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని వినాయక్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది.

విద్యుత్ బిల్లు చూసి షాక్‌కు గురైన పాఠశాల యాజమాన్యం.. ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది.

కానీ.. సంబంధిత అధికారులు ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా.. ఈ నెల ఏడో తేదీ లోపు బిల్లు చెల్లించకుంటే పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హుకుం జారీచేశారు.

ఇవి కూడా చదవండి: