ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఇద్దరు ఆటగాళ్లు, రెండు దేశాలు, ఒకే కుటుంబం, ఆ రెండు దేశాలు తలపడితే?

ఫొటో సోర్స్, Souttar family
- రచయిత, లారా గుడ్విన్ , క్రెయిగ్ విలియమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లను వీక్షించే స్కాట్లాండ్ ప్రజలకు ఏజట్టుకు మద్దతిస్తున్నామన్నది అసలు ప్రశ్నే కాదు.
అయితే ఫుట్‌బాల్ అంటే చెవికోసుకునే జాక్, హీథర్ సౌట్టర్ దంపతులకు ఈ వారం అమెరికా వెళ్లడానికి మిగిలిన ఫుట్‌బాల్ అభిమానుల కంటే ప్రత్యేక కారణమే ఉంది. ఈ దంపతులు అబర్డీన్షైర్లోని లూథర్మ్యూర్కు చెందినవారు.
వీరికి జాన్, హ్యారీ అనే ఇద్దరు పిల్లలున్నారు. వీరిలో జాన్ స్కాట్లాండ్ తరపున నీలిరంగు జెర్సీతో తొలిసారి పుట్‌బాల్ ప్రపంచకప్ సమరంలో అడుగుపెడుతున్నాడు. మరోపక్క హ్యారీ ఆస్ట్రేలియా తరపున బంగారు రంగు జెర్సీతో బరిలోకి దిగుతున్నాడు.
ఇలా వేరు వేరు దేశాల తరపున మైదానంలోకి దిగుతున్న తమ బిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. వారిద్దరు ఆడుతుంటూ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తొలి రౌండ్లోనే జరిగే తమ ఇద్దరు కుమారుల మ్యాచ్‌లను చూడటానికి ఈ దంపతులు ఆరు రోజుల వ్యవధిలోనే 3వేల మైళ్ల దూరంలో ఉన్న రెండు వేదికలకు ప్రయాణించాల్సి ఉంటుంది.
స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మొదటి రౌండులో ముందడుగు వేయాలని కోరుకుంటున్న వీరు ఆ తర్వాతి మ్యాచ్‌లను చూడటానికి వెళ్లాలని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Souttar family
ఇద్దరు పిల్లలు రెండు వేరువేరు టీముల్లో..
"ఇది చాలా పెద్ద విషయమనే చెప్పాలి. మా ఇద్దరు పిల్లలకూ, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు దేశాలకూ మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది" అని జాక్ చెబుతున్నాడు.
పిల్లలిద్దరూ డిఫెండర్లే. జాన్ ప్రస్తుతం రేంజర్స్ తరపున ఆడుతున్నారు. అంతకు ముందు ఆయన డండీ యునైటెడ్, హార్ట్స్ టీమ్ తరపున ఆడారు. మరో వైపు హ్యారీ కూడా టన్నడైస్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించి, స్టోక్‌లో కొంత కాలం ఆడిన తరువాత లీసెస్టర్ సిటీలో చేరారు.
జాన్ 2018లో స్కాట్లాండ్ తరపున తొలిసారి ఆడారు. తల్లి హీథర్ ఆస్ట్రేలియాలో జన్మించిన కారణంగా హ్యారీ 2019 నుండి ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నారు.
కుమారులిద్దరూ అత్యున్నతస్థాయిలో ఆడుతుండటంతో, వారి విజయాలను సమానంగా ఆస్వాదిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
తమ పిల్లల మధ్య స్నేహ పూర్వకమైన పోటీ ఉంటుందని పరస్పరం ప్రోత్సహించుకునే అనుబంధం కూడా బలంగానే ఉందని జాక్, హీథర్ దంపతులు చెప్పారు.
"వాళ్లిద్దరూ అన్నదమ్ములు. చిన్నప్పుడు వాళ్ల మధ్య కొద్దిగా గొడవలు జరిగేవి. ఇద్దరూ ఎప్పుడూ ఆటల గురించి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు అండగా ఉంటారు"అని జాక్ చెప్పారు.
సౌట్టర్ కుటుంబంలో ఫుట్‌బాల్ కీలక పాత్ర పోషించింది.

ఫొటో సోర్స్, Souttar family
జాక్ యవ్వనంలో ఉన్నప్పుడు బ్రెకిన్ తరపున ఫుట్‌బాల్ ఆడారు. ఆయన తర్వాతి తరంలోని ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కూడా ఫుట్‌బాల్ ఆడుతున్నారు.
"అది మాకెప్పుడూ ఒక పనిలా అనిపించలేదు. వారానికి రెండు సార్లు డండీలో శిక్షణ తీసుకున్నాం. తర్వాత వారానికి రెండు సార్లు గ్లాస్గోకు వెళ్లి అక్కడ శిక్షణ తీసుకునేవాళ్లం" అని జాక్ చెప్పారు.
వాళ్లు కెరీర్లో ఎదిగే కొద్దీ డింగ్వాల్, ఫ్లీట్ఉడ్, స్టోక్‌తో పాటు యూరప్ అంతటా తిరిగారు.
"వారికి అండగా దేశమంతటా తిరిగాం. నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. మేం పిల్లల మీద చిరాకు పడే తల్లిదండ్రుల మాదిరిగా ఉండాలనుకోలేదు. ఆటను ఆనందించాం" అని జాక్ అన్నారు.
ఈ కుటుంబానికి ఈ ప్రపంచ కప్ మొదటిది కాదు.
1998లో స్కాట్లాండ్ ఫైనల్స్‌లో ఆడేటప్పుడు జాక్ తన పెద్ద కుమారుడు ఆరోన్తో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి మ్యాచ్ చూశారు.
అప్పుడు జాన్ చాలా చిన్నవాడు కావడంతో తల్లి హీథర్పాటు ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ సమయంలో హీథర్ గర్భిణిగా ఉన్నారు.
"నేను వెళ్లలేకపోయాను’’ అని హీథర్ గుర్తుచేసుకున్నారు.
‘‘కానీ తరువాతి అవకాశం రావడానికి 28 ఏళ్లు పట్టింది. చాలా కాలం ఎదురుచూశాను’’ అన్నారు.
కానీ 28 ఏళ్ల తరువాత అప్పుడు గర్భంలో ఉన్నహ్యరీ, ఇప్పుడు ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు.

ఫొటో సోర్స్, Souttar family
ఈసారి, నాలుగు తరాల బంధువులు, స్నేహితులు మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారు. ఏర్పాట్లను హీథర్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఐదుగురు తోబుట్టువులలో పెద్దవాడైన ఆరోన్ 2022 జులైలో మోటార్ న్యూరాన్ వ్యాధితో సుదీర్ఘ పోరాటం చేసి మరణించారు.
జాన్, హ్యారీ తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకోవడంలో ఆరోన్ సాయపడ్డాడని, అతనే తమకు ఆదర్శమని చెబుతారు.
2022లో ఖతార్‌లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో హ్యారీ ఆస్ట్రేలియా తరపున ఆడారు. జాన్ ఈ సంవత్సరం తొలి మ్యాచ్ ఆడుతున్నారు.
ఇద్దరు ఆటగాళ్లు, రెండు దేశాలు, ఒకే కుటుంబం. అదృష్టత్తువశాత్తూ స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడితే, ఇద్దరు సోదరులు ప్రత్యర్థులుగా మైదానంలో నిలిస్తే? "మా ఇద్దరు పిల్లల విషయంలో మా భావోద్వేగాలు ఒకేలా ఉంటాయి" అని జాక్ చెబుతున్నారు.
"మాది స్కాట్లాండ్. అంత మాత్రాన, హ్యారీ పట్ల మా ప్రేమ ఏమాత్రం తగ్గదు" అని జాక్ చెప్పారు.
"ఏ క్రీడలోనైనా, ఏ రంగంలోనైనా తమ పిల్లలు విజయవంతమైతే తల్లిదండ్రులు ఎంత గర్వపడతారో, మేమూ అంతే గర్వపడుతున్నాం’’ అన్నారు.
తమ కుటుంబానికి 2026 సంవత్సరం, అమెరికా కొన్ని కొత్త జ్ఞాపకాలు సృష్టించుకునే అవకాశంగా నిలవబోతోందని హీథర్ చెబుతున్నారు.
"ఫుట్‌బాల్ పరంగా మాకు కొత్త కథలు పుడతాయి. ఎందుకంటే మేము ఫ్రాన్స్ 1998 కథలనే ఇన్నాళ్లూ వింటున్నాం. ఇప్పుడు కుటుంబమంతటికీ కొత్త కథలు, కొత్త జ్ఞాపకాలు ఉంటాయి" అని ఆమె అన్నారు.
"జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలు, కథలు... కుటుంబాలకు కావాల్సింది అంతకన్నా ఇంకేముంటుంది?" అంటారు హీథర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























