అటకామా ఎడారిలో కుప్పలుకుప్పలుగా పాత దుస్తులు

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, జేన్ ఛాంబర్స్
- హోదా, బిజినెస్ రిపోర్టర్, ఆల్టో హాస్పిసియో, నార్తర్న్ చిలీ
- చదివే సమయం: 5 నిమిషాలు
యూకే సహా యూరప్ దేశాలు, అమెరికాలోని పాత దుస్తులు చిలీ ఉత్తర ప్రాంతంలోని ఒక ఎడారిలో గుట్టలుగా పోగుపడుతున్నాయి.. ఎందుకో తెలుసా?
పాత బట్టలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో దక్షిణ అమెరికాలోని చిలీ ఒకటి.
అలా దిగుమతి చేసుకున్న దుస్తుల్లో తిరిగి అమ్ముడుపోనివి, పనికిరానివన్నీ ఖాళీ ప్రదేశాల్లో పడేస్తుంటారు.
ఇలా చేయడంపై ఆంక్షలు విధిస్తూ చిలీలో కొత్త చట్టం తీసుకొచ్చారు. దీంతో చిలీలోని ఒక కంపెనీ పాత దుస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.
చిలీ ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏటా సుమారు 1,23,000 టన్నుల వాడిన దుస్తులు ఆ దేశంలోకి దిగుమతి అవుతున్నాయి.
చిలీ ఉత్తర ప్రాంతంలోని ఇక్విక్ ఫ్రీ ట్రేడ్ పోర్ట్ కేంద్రంగా ఈ దిగుమతులు జరుగుతాయి.
దీన్ని జోఫ్రీ అంటారు. ‘జోనా ఫ్రాంకా డెల్ ఇక్విక్’(ఇక్విక్ ఫ్రీ ట్రేడ్ జోన్)కు సంక్షిప్త రూపం జోఫ్రీ.
ఇక్విక్, సమీప పట్టణాలు ఈ ఫ్రీ ట్రేడ్ జోన్ పరిధిలోకి వస్తాయి. దీంతో ఇక్విక్, సమీప పట్టణాల్లోని వ్యాపారులు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ కానీ వ్యాట్ కానీ చెల్లించనవసరం లేకుండానే ఈ పోర్ట్ ద్వారా దిగుమతులు చేసుకోవచ్చు, సరకు నిల్వ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు.
దీంతో ఇక్విక్ ఫ్రీ ట్రేడ్ పోర్ట్ ద్వారా పాత దుస్తులు పెద్ద ఎత్తున చిలీకి చేరుతున్నాయి.
యూరప్ దేశాలు, ఆసియా దేశాలు, అమెరికా, కెనడా నుంచి షిప్పింగ్ కంటైనర్లలో ఇవి దిగుమతి అవుతాయి.
వీటిని చిలీలోనే విక్రయించడంతో పాటు అక్కడి నుంచి ఇతర లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తారు.

‘దుస్తులు దిగుమతి చేసుకునే సుమారు 50 కంపెనీలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు సాయపడుతున్నాయి. ఈ రంగం స్థానిక మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తోంది" అని జోఫ్రీ జనరల్ మేనేజర్ ఫెలిప్ గొంజాలెజ్ చెప్పారు.
‘‘మహిళలు దుస్తులను వాటి నాణ్యత ప్రకారం వేర్వేరు విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇది ఎక్కువ నైపుణ్యం అవసరం లేని పని కావడంతో, పెద్దగా విద్యార్హతలు లేనివాళ్లు కూడా ఈ పనిచేయగలరు’’ అన్నారు గొంజాలెజ్.
నాసిరకం దుస్తులను "లా క్వెబ్రాడిల్లా"కి పంపిస్తారు. ఇది ఆల్టో హాస్పిసియో పట్టణం దగ్గర ఉన్న పెద్ద ఓపెన్-ఎయిర్ మార్కెట్. ఇక్విక్ నుంచి సుమారు 30 నిమిషాల దూరంలో కొండపైన ఉంటుంది. కానీ జోఫ్రీ పరిధిలోనే ఉంటుంది.
అక్కడ వరుసగా టెంట్లు ఉంటాయి, వాటిలో పాత దుస్తులన్నీ గుట్టలుగుట్టలుగా ప్లాస్టిక్ షీట్లపై వేసి ఉంటాయి.
దుకాణదారులు టీ-షర్ట్లు, జీన్స్, డ్రెస్సులు అన్నీ అమ్ముతారు. ధరలు చాలా తక్కువగా ఉంటాయి. 500 చిలీన్ పెసోలు(సుమారు రూ. 52) నుంచి మొదలవుతాయి. తక్కువరేటుకి బేరామాడి కొనక్కోవచ్చని పర్యటకులు, స్థానికులు వీకెండ్‌లో ఇక్కడికి వస్తారు.

పాత దుస్తులు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నప్పటికీ అందులో అమ్ముడుపోని వాటితో సమస్యలు ఏర్పడుతున్నాయి.
వాటిని స్థానిక కౌన్సిల్ ల్యాండ్‌ఫిల్(చెత్త, వ్యర్థాలను వేసే ప్రదేశం)లో వేయడానికి వీల్లేదు. ఈ ల్యాండ్‌ఫిల్స్ గృహ వ్యర్థాలకు ఉద్దేశించినవి.. అక్కడ వాణిజ్య దిగుమతుల వ్యర్థాలను అక్కడ వేయడానికి అనుమతులు ఇవ్వరు.
దీంతో... ఇలా అమ్ముడుపోని పాతబట్టలను వ్యాపారులు ఇంకెక్కడికైనా ఎగుమతి చేయాలి, లేదంటే చిలీలో ఫ్రీ-ట్రేడ్ జోన్ బయట అమ్మడానికి పన్ను చెల్లించాలి. అదీకాదంటే అనుమతి ఉన్న వ్యర్థాల నిర్వహణ సంస్థలకు ఇవ్వాలి.
కానీ వీటన్నింటికీ చాలా ఖర్చవుతుండడంతో కొంతమంది వ్యాపారులు వాటిని అక్రమంగా కాల్చేస్తారు లేదా దగ్గరలోని అటకామా ఎడారిలో పడేస్తారు.
ఏటా సుమారు 39,000 టన్నుల పాత దుస్తులు ఇలా చట్టవిరుద్ధంగా అటకామా ఎడారిలో పడేస్తున్నారని అంచనా.
ఇలా పడేయడం ఆల్టో హాస్పిసియో నగర అధికారులకు పెద్ద సమస్యగా మారింది.
"అక్రమంగా దుస్తులు పడేయడాన్ని గమనించడం, ఆపడం చాలా కష్టం" అని పట్టణ ప్లానింగ్ విభాగంలో పనిచేసే మిగెల్ పైనేనాహుయేల్ చెప్పారు.
ఆల్టో హాస్పిసియో నగరం చుట్టూ ఎడారి, కొండలు ఉన్నాయని, అక్కడికి ట్రక్కుల్లో తీసుకెళ్లి పనికిరాని దుస్తులను పడేస్తారని అని ఆయన అన్నారు.
అయితే పట్టణ కౌన్సిల్ మాత్రం పెట్రోలింగ్ కార్లు, కెమెరాలతో గస్తీ నిర్వహిస్తూ, తప్పు చేసినవారికి జరిమానాలు వేస్తోందని ఆయన అన్నారు.
"చాలా ట్రక్కులు పాతబట్టలను పారేస్తున్నాయి. వాటిని పూర్తిగా నియంత్రించడం కష్టం, మా వద్ద సరిపడా వనరులు లేవు" అని ఆయన చెప్పారు.
అయితే ఈ పాతబట్టలను వ్యాపార అవకాశంగా మార్చే పరిష్కారం ఇప్పుడు దొరికింది.
ఇక్విక్‌లోని ‘సెంట్రో టెక్నలాజికో డి ఎకనామియా సర్క్యులార్’ సంస్థకు లూయిస్ మార్టినెజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వనరులను పారేయకుండా తిరిగి ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రైవేట్ సంస్థ ఇది.
అమ్ముడుపోని పాత బట్టలను రీసైకిల్ చేసే ప్రాజెక్ట్‌కు ఇటీవల మార్టినెజ్ నేతృత్వం వహించారు.
అటకామా ఎడారి పాత దుస్తుల గుట్టలతో పేరుకుపోయిన టూరిస్ట్ స్పాట్‌గా మారకూడదని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
అవసరం లేని దుస్తులను వేరే కొత్త పద్ధతిలో ఉపయోగించే విధానం కోసం ఒక ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉందని ఆయన చెప్పారు. దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీ నడుపోతుంది. ఇది పెద్దమొత్తంలో పాత దుస్తులను మేనేజ్ అంచనా వేస్తున్నారు.
ఆల్టో హాస్పిసియో నుంచి సుమారు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న వేడి, గాలులతో కూడిన ఎడారిలో బెకిర్ కొన్కూర్ అనే వ్యాపారవేత్త ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఈయన తుర్కియేకు చెందినవారు, కానీ 15 ఏళ్లకు పైగా చిలీలోనే పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద టెక్స్‌టైల్ దిగుమతిదారులలో ఆయన ఒకరు. ఆయన కంపెనీ ప్రతి నెలా సుమారు 50 కంటైనర్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటుంది.
అక్రమంగా పడేస్తున్న పాతబట్టల సమస్యకు పరిష్కారం దొరకాలని ఆయన కోరుకుంటున్నారు, ఈ ఫ్యాక్టరీ అందుకు సాయపడుతుందని ఆయన నమ్ముతున్నారు.
కొన్ని నెలల్లో ప్రారంభం కానున్న ఈ ఫ్యాక్టరీ నీరు లేదా రసాయనాలు అవసరం లేకుండా పనిచేస్తుంది. యంత్రాలు పాత దుస్తులను ఫైబర్లుగా, ఆ తర్వాత ఫెల్ట్‌గా మార్చుతుంది.
ఈ ఫెల్ట్‌ను మాట్రిస్‌లు, ఫర్నిచర్, కార్ల లోపల ఇన్సులేషన్ కోసం ఉపయోగిస్తారు.
'ఈ ఫ్యాక్టరీ రోజుకు సుమారు 20 టన్నుల పాత దుస్తులను ప్రాసెస్ చేయగలదని అంచనా వేస్తున్నాం' అని ఆయన అంటున్నారు.

ఈ ఫ్యాక్టరీని నిర్మించడానికి ఒక కారణం కొత్త చట్టాన్ని పాటించడం అని ఆయన చెప్పారు.
నిరుడు జులైలో చిలీ "ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ లా"లో టెక్స్‌టైల్స్‌ను కూడా చేర్చింది. ఈ చట్టం ప్రకారం ఉత్పత్తులు ఏమవుతున్నాయో చివరి వరకు చూసుకునే బాధ్యత... వాటిని విక్రయించే కంపెనీలదే.
అంటే ఈ చట్టం ప్రకారం పాత దుస్తులను సేకరించడం, మళ్లీ ఉపయోగించడం, రీసైక్లింగ్ చేయడం, సరైన పద్ధతుల్లో పారేయడం కోసం ఖర్చు పెట్టే బాధ్యత ఫ్యాషన్ బ్రాండ్లు, రిటైలర్లు, దిగుమతిదారులదే. వారే వాటిని నిర్వహించాలి.
ఈ బాధ్యత ఇకపై స్థానిక కౌన్సిల్స్ లేదా పర్యావరణ మంత్రిత్వ శాఖపై ఉండదు.
ప్రస్తుతం ప్రభుత్వం టెక్స్‌టైల్స్ రంగానికి సంబంధించిన ఖచ్చితమైన నియమాలను రూపొందిస్తోంది.
బెకిర్‌కు ఇది ఒక పెద్ద వ్యాపార అవకాశం కూడా. ఆయన ఈ ఫ్యాక్టరీలో 70 లక్షల డాలర్లు (సుమారు రూ.65 కోట్లు) పెట్టుబడి పెట్టారు. చిలీ నుంచే కాకుండా భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పాత దుస్తులను ప్రాసెస్ చేస్తామంటున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































