బ్యాటింగ్‌లో సిక్సర్లు, బౌలింగ్‌లో వికెట్లు, ఓవరాల్‌గా విజయాలు.. పంజాబ్ కింగ్స్‌కు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రదీప్ కృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
న్యూ చండీగఢ్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది.
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది.
మొదటి నాలుగు మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఇందులో రెండు సార్లు 200 పైచిలుకు స్కోరును చేజ్ చేసింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 196 పరుగుల లక్ష్యాన్ని మరో 21 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది.
అయితే, లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. ఆ మ్యాచ్‌లో 254 పరుగులు చేసి ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పంజాబ్ కింగ్స్ మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు సీజన్‌ను బలంగా ప్రారంభించినా కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాయి. కానీ, పంజాబ్ కింగ్స్ మాత్రం అజేయంగా దూసుకుపోతోంది. మరి, ఈ జట్టు ఆధిపత్యానికి కారణాలేంటి?


స్థిరత్వం

ఫొటో సోర్స్, ANI
ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు ఒకప్పుడు మార్పులకు నిలువెత్తు రూపంగా ఉండేది. ప్రతి సీజన్‌లో కొత్త కోచ్‌లు, కెప్టెన్లు, ఆటగాళ్లు వచ్చేవారు. ప్రతి మ్యాచ్‌కూ ఆటగాళ్లతో పాటు ఆడే శైలి కూడా మారిపోయేది. అయితే, ప్రస్తుత పంజాబ్ కింగ్స్ జట్టులో ఒక స్పష్టమైన స్థిరత్వం కనిపిస్తోంది.
ఈ సీజన్ వేలానికి ముందు పంజాబ్ తన జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. గత ఏడాది ఫైనల్ చేరిన జట్టులోని 21 మంది ఆటగాళ్లను అలాగే అట్టిపెట్టుకుంది. ఈ సీజన్‌లోనూ అదే కొనసాగింపును పాటిస్తోంది. 2025 ఐపీఎల్ ఫైనల్ ఆడిన 12 మంది ఆటగాళ్లలో 10 మంది ఈ సీజన్‌లోనూ ఆడుతున్నారు. జోష్ ఇంగ్లిస్ స్థానంలో కూపర్ కానోలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ స్థానంలో జేవియర్ బార్ట్లెట్ మాత్రమే కొత్తగా వచ్చారు. మిగిలిన వారంతా పాత జట్టు సభ్యులే.
అంతేకాదు, ఈ సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌లో ఆ 12 మంది ఆటగాళ్లే మైదానంలోకి దిగారు. ఏ మ్యాచ్‌లోనూ మార్పులు చేయలేదు. కొందరు ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌ల్లో గాయపడినా, వారికి మళ్లీ అవకాశం కల్పించారు. ఇది ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతోంది.
లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో వైశాఖ్ విజయ్ కుమార్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. మ్యాచ్ అనంతరం వైశాఖ్ మాట్లాడుతూ.. "గత రెండు మ్యాచ్‌లలో బౌలింగ్ సరిగా పడలేదు. కోచ్, వీడియో అనలిస్ట్ మద్దతు లేకపోతే నేను ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోయేవాడిని" అని చెప్పాడు.
ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చిన వైశాఖ్, సన్‌రైజర్స్‌పై కూడా అధికంగా పరుగులు ఇచ్చాడు. కానీ, ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వరుస అవకాశాలు ఇస్తే వారు మెరుగ్గా రాణించగలరని ఇక్కడ నిరూపితమైంది.
గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు ఇలాంటి వ్యూహాలనే అమలు చేసేవి. వారి విజయాలకు ఈ స్థిరత్వమే ప్రధాన కారణమని ప్రశంసించేవారు. ఇప్పుడు అదే పద్ధతి పంజాబ్ కింగ్స్‌లోనూ కనిపిస్తోంది.

బలమైన బ్యాటింగ్ లైనప్

ఫొటో సోర్స్, ANI
పంజాబ్ కింగ్స్ అతిపెద్ద బలం జట్టు బ్యాటింగ్. తొమ్మిదో నంబర్‌లో వచ్చే బార్ట్‌లెట్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం, బార్ట్లెట్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సగటు 16, స్ట్రైక్ రేట్ సుమారు 125గా ఉంది. అతనికి ప్రతి ఏడు బంతుల్లో ఒక ఫోర్ లేదా సిక్స్ కొట్టగల సామర్థ్యం ఉంది. తొమ్మిదో నంబర్ బ్యాటర్ గణాంకాలే ఇలా ఉన్నాయంటే, ఆ జట్టు బ్యాటింగ్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంటే ప్రతి ఆటగాడికి మొదటి నుంచే దూకుడుగా ఆడే వీలు కలుగుతుంది. వికెట్లు పడతాయనే భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతారు. పంజాబ్ తన జట్టులో ఈ వ్యూహాన్నే అమలు చేయాలనుకుంటోంది.
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. అందుకే వారు మొదటి నుంచే రన్ రేట్ తగ్గకుండా ఆడగలుగుతున్నారు. ప్రియాంశ్, కూపర్, నెహాల్ వధేరా వంటి ఎడమచేతి వాటం బ్యాటర్లు రాణించడం వల్ల, చివరి వరకు లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌ను జట్టు కొనసాగించగలుగుతోంది. అంతేకాదు, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరిస్థితికి తగ్గట్టుగా ఆడాలని ఆటగాళ్లకు స్పష్టమైన సూచనలున్నాయి.
సీఎస్‌కే, ముంబయి జట్లలాంటి స్థిరత్వం ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌లో ఉంది. అలాగే ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన మార్పులను అందిపుచ్చుకునే సామర్థ్యం కూడా ఉంది.

పరిణితి చెందిన బౌలర్లు

ఫొటో సోర్స్, ANI
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్ అనంతరం ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫోతో క్రికెటర్, వ్యాఖ్యాత ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ, "పంజాబ్ కింగ్స్ బౌలింగ్ యూనిట్ అత్యుత్తమ డిఫెన్సివ్ విభాగాలలో ఒకటి" అన్నారు.
"ఈ మ్యాచ్‌లో డిఫెన్సివ్ బౌలింగ్ చేయాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. దానికి తగ్గట్టుగానే బంతులు వేశారు. ఆ జట్టులోని మెజారిటీ బౌలర్లు వికెట్లు తీయగల సమర్థులు కావడం విశేషం. డిఫెన్సివ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా వారు మంచి ప్రదర్శన చేశారు" అని డుప్లెసిస్ పేర్కొన్నారు.
ప్రస్తుతం 250 పరుగులు సాధించడం కామన్ అయిపోయినప్పుడు, డిఫెన్సివ్ బౌలింగ్ చాలా కీలకం. చాలా జట్లు వికెట్ల కోసం ఆరాటపడుతూ ధారాళంగా పరుగులు ఇస్తుంటే, పంజాబ్ కింగ్స్ మాత్రం సంయమనంతో బౌలింగ్ చేసి విజయాలను సులువుగా దక్కించుకుంటోంది.
మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు దీని గురించి మాట్లాడుతూ, "ఏ పరిస్థితిలో ఏం చేయాలో వారికి బాగా తెలుసు. ఇదొక పరిణతి చెందిన, దృఢ నిశ్చయం గల సమర్థవంతమైన బౌలింగ్ యూనిట్‌లా కనిపిస్తోంది" అన్నారు.
ఐపీఎల్ వంటి పెద్ద టోర్నమెంట్లలో ఆధిపత్యం చెలాయించాలంటే బౌలింగ్ విభాగం రాణించాలి. పంజాబ్ విషయంలో అదే జరుగుతోంది. గతంలో వికెట్లు తీయడంలో తడబడిన అర్ష్‌దీప్ సింగ్ ఇప్పుడు పాత ఫామ్‌ను అందుకున్నాడు. దీంతో పంజాబ్ బౌలింగ్ విభాగం బలంగా తయారైందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

శ్రేయస్ కెప్టెన్సీ

ఫొటో సోర్స్, ANI
ప్రతిభావంతులైన ఆటగాళ్లు, ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు, బౌలర్లు ఉన్న జట్టును శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపిస్తున్నాడు. అతని బ్యాటింగ్ శైలి చక్కగా ఉంటుంది. పేస్, స్పిన్ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అలాగే జట్టులో ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను నింపుతున్నాడు.
కీలక సమయాల్లో తన బ్యాటింగ్‌తో మ్యాచ్ దిశను మార్చగల సత్తా శ్రేయస్‌కు ఉంది. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వికెట్ తీయడానికి అతను బౌండరీ లైన్ వద్ద గాలిలోకి ఎగిరి బంతిని పట్టుకుని బార్ట్లెట్‌కు విసిరిన తీరు గుర్తుండిపోతుంది. ఇటువంటి సాహసాలు జట్టు మొత్తానికి స్ఫూర్తినిస్తాయని కామెంటేటర్లు అన్నారు.
కెప్టెన్‌గా మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన చాహల్ తన కోటాను పూర్తి చేయకముందే, అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్‌ను రంగంలోకి దించడానికీ శ్రేయస్ వెనుకాడటం లేదు. పక్కా ప్రణాళికలతో పాటు ఆటగాళ్లలో భరోసా నింపడం జట్టులో మంచి వాతావరణానికి ప్రధాన కారణం.
ఉదాహరణకు, లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్‌లో శశాంక్ సింగ్ మూడు క్యాచ్‌లు జారవిడిచాడు. దీనిపై కోచ్ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించినా, శశాంక్ మూడో క్యాచ్ వదిలేసినప్పుడు శ్రేయస్ బౌండరీ బయట నవ్వుతూ సహచర ఆటగాళ్లతో ముచ్చటిస్తూ కనిపించాడు. తమ జట్టు ఎలాగూ గెలుస్తుందనే నమ్మకంతో అతను నవ్వుతూ ఉన్నా, ఆ ప్రవర్తన క్యాచ్‌లు వదిలేసిన ఆటగాడు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడింది. మ్యాచ్ ముగిశాక శ్రేయస్ నవ్వుతూ శశాంక్ భుజంపై చేయి వేసి ఓదార్చాడు. మూడు క్యాచ్‌లు వదిలేస్తే ఏ ఆటగాడైనా నిరాశకు లోనవుతాడు, కానీ శ్రేయస్ ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసిన విధానం ఆ ఆటగాడిలో ప్రతికూల భావాలు కలగకుండా చేసింది.

జట్టులో ఆరోగ్యకరమైన పోటీ

ఫొటో సోర్స్, ANI
పంజాబ్ కింగ్స్ జట్టులో స్థిరత్వం ఉంది. ఆ జట్టు నిలకడగా, నాణ్యమైన ప్రదర్శన చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు జట్టులో ప్రతి స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. శ్రేయస్, అర్ష్‌దీప్, చాహల్ మినహా మిగిలిన ఏ ఆటగాడినైనా సులభంగా మార్చగలిగే పరిస్థితి ఉంది. ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు బెంచ్‌పై సిద్ధంగా ఉన్నారు.
కూపర్ స్థానంలో మిచెల్ ఓవెన్, స్టోయినిస్ స్థానంలో ఒమర్జాయ్, బార్ట్లెట్ స్థానంలో లాకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకోవడం వీరికి పెద్ద కష్టమేమీ కాదు. భారతీయ ఆటగాళ్లలోనూ మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. టాప్ ఆర్డర్ కోసం విష్ణు వినోద్, మిడిల్ ఆర్డర్ కోసం సూర్యాంశ్ షెడ్గే, స్పిన్ కోసం హర్‌ప్రీత్ బ్రార్, ఫాస్ట్ బౌలింగ్ కోసం యశ్ ఠాకూర్ వంటి బెస్ట్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇంత బలమైన జట్టు ఉన్నప్పుడు, ప్రతి ఆటగాడు తన అత్యుత్తమంగా ఆడాలనే బాధ్యతను గుర్తిస్తాడు. జట్టులో తన స్థానం గురించి ఆటగాడికి పూర్తి స్పష్టత ఉన్నప్పుడు, అది వారిలోని ప్రతిభను బయటకు తీస్తుంది.
ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో విశ్లేషకుడు గౌరవ్ సుందరరామన్ మాట్లాడుతూ.. "లఖ్‌నవూ జట్టులోని విదేశీ ఆటగాళ్లంతా టాప్ ఆర్డర్ బ్యాటర్లే. పూరన్, మార్ష్, మార్‌క్రమ్ స్థానాల కోసం కేవలం బ్రిట్స్కీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. తమ స్థానానికి ఎవరూ పోటీ లేరని తెలిసినప్పుడు ఆటగాళ్లు నిరాసక్తతకు లోనై, తమ అత్యుత్తమ ఆటను చూపించలేకపోవచ్చు " అని పేర్కొన్నారు.
కానీ, పంజాబ్ కింగ్స్ జట్టుకు అటువంటి సమస్య లేదు. జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య నిరంతరం పోటీ ఉండటం వల్ల, ప్రతి ఒక్కరూ గెలవాలనే పట్టుదలతో శాయశక్తులా కృషి చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































