You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిందూ మహాసముద్రంలో చమురు ట్యాంకర్‌పై పైరేట్స్ దాడి, హైజాక్
- రచయిత, మొహమద్ గబోబ్
- హోదా, మొగడిషు
- చదివే సమయం: 3 నిమిషాలు
సోమాలియా తీరానికి సమీపంలో ఒక చమురు ట్యాంకర్‌ను సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేశారని, అందులో 17 మంది సిబ్బంది ఉన్నట్లు బీబీసీతో మాట్లాడిన పలువురు భద్రతాధికారులు తెలిపారు.
హానర్ 25 అనే నౌక, తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఆరుగురు సాయుధులు దానిపై దాడి చేశారని, బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
ఒకప్పుడు హైజాక్‌లకు ప్రసిద్ధి చెందిన హిందూ మహాసముద్రంలోని ఈ ప్రాంతంలో మూడేళ్ల కిందటి వరకు సముద్రపు దొంగతనాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. కానీ, ఆ తర్వాతి నుంచి చేపల వేటకు వెళ్లే పడవలు, కంటైనర్ నౌకలు లక్ష్యంగా దాడులు జరగడం మొదలైంది.
సోమాలియా రాజధాని మొగడిషుకు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను హైజాక్ చేయడంతో ఆ నగరంలో ఆందోళనలు పెరిగే అవకాశముంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొగడిషులో పెట్రోల్ ధరలు ఇప్పటికే మూడురెట్లు పెరిగాయి.
హైజాక్‌కు గురైన చమురు నౌక 18,500 బ్యారెళ్ల చమురు తీసుకెళ్తోందని సోమాలియాలోని పుంట్‌లాండ్ భద్రతాధికారులు బీబీసీకి తెలిపారు.
షిప్‌అట్లాస్ వెబ్‌సైట్ ప్రకారం, హైజాక్ అయిన ఓడ ఫిబ్రవరి 20న స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్‌లోని బర్బెరా పోర్టు నుంచి బయలుదేరింది. సంఘర్షణ ప్రారంభమయ్యేప్పటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరప్రాంత సమీపానికి చేరుకుంది.
ఆ తర్వాత, హార్ముజ్ జలసంధి ప్రవేశ ద్వారం సమీపంలోని జలాల్లో తిరుగుతూ, ఏప్రిల్ 2న మొగడిషు వైపు వెళ్తున్నట్లు షిప్పింగ్ మ్యాప్ చూపుతోంది.
హైజాక్ అయిన ఈ నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 10 మంది పాకిస్తానీలు, ఇండోనేషియాకు చెందిన నలుగురు, ఒక భారతీయుడు, శ్రీలంక వ్యక్తి ఒకరు, మియన్మార్ వాసి ఒకరు ఉన్నారు. ఈ నౌక సోమాలియా తీరానికి సమీపంలో, హాఫూన్ - బందర్ బేలా అనే పట్టణాల మధ్య లంగరు వేసింది.
ఆ తర్వాత మరో ఐదుగురు సాయుధులు హానర్ 25లోకి ఎక్కినట్లు సోర్సెస్ తెలిపాయి.
బందర్ బేలా సమీపంలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి హైజాకర్లు బయలుదేరి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకుని, దానిని ఎలా తమ నియంత్రణలోకి తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే, ఈ హైజాక్ గురించి సోమాలియా అధికారులు గానీ, సోమాలియా జలాల్లో సముద్రపు దొంగల వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించే యూరోపియన్ నావల్ ఫోర్స్ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)