You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
న్యూగు: జూ నుంచి తప్పించుకున్న ఈ తోడేలు కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది, అదంటే ఎందుకంత భయం?
- రచయిత, కోహ్ ఇవియ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
దక్షిణ కొరియాలోని డేజియోన్ నగరంలో ఉన్న జూ నుంచి గత వారం ఒక తోడేలు తప్పించుకుంది. జూ చుట్టూ ఉన్న ఇనుప కంచెకు కన్నం చేసి పారిపోయింది.
అప్పటి నుంచి దాన్ని పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు అనేక మలుపులు తిరుగుతూ ప్రజల్లో ఆసక్తిని పెంచాయి. తోడేలు వేట ఏ స్థాయికి చేరిందంటే దాని పేరుతో క్రిప్టో కాయిన్ తరహాలో మీమ్ కాయిన్ తయారైంది. ఆ తోడేలు పేరు న్యూగు.
జూ నుంచి తప్పించుకున్న తోడేలుని పట్టుకునేందుకు 300కి పైగా అగ్నిమాపక విభాగపు అధికారులు, సైనికులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ వాళ్లెవరికీ దొరక్కుండా న్యూగు వారం రోజులుగా తప్పించుకు తిరుగుతోంది.
కొన్నిసార్లు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకుంది. తప్పించుకున్న తర్వాతి రోజు జూ పక్కనే ఉన్న థీమ్‌పార్క్‌లో అమర్చిన థర్మల్ ఇమేజింగ్ కెమెరాల్లో చిక్కింది. పార్క్ పక్కనే ఉన్న ఆకుపచ్చ పొదల్లో మెరుస్తున్న ముద్దలా కనిపించింది.
అధికారులు డ్రోన్ సాయంతో తోడేలు ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే డ్రోన్ బ్యాటరీ అయిపోవడంతో బ్యాటరీ మార్చే సమయంలో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సోమవారం రాత్రి మరోసారి దాని ఆచూకీ తెలిసింది. డేజియోన్ ఓ వరల్డ్ నుంచి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ కొండ మీద తోడేలు కనిపించిందని స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందింది.
రోడ్ల మీద వాహనాల హెడ్లైట్ల కాంతిలో చీకట్లోకి వెళుతున్న తోడేలు వీడియోను ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ వీడియో అధికారులకు చేరడంతో పదుల సంఖ్యలో పోలీసులు మిలటరీ డ్రోన్లు తీసుకుని వెదకడం ప్రారంభించారు.
తోడేలు ప్రతీసారి దొరికినట్లే దొరికి కనిపించకుండా పోయింది. పోలీసులు డ్రోన్లతో వెదకడం మొదలు పెట్టిన తర్వాతి రోజు ఉదయం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
అడవి తోడేలు కోసం వేట
న్యూగు కోసం వెదుకులాట దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడంతో స్థానిక ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తున్నారు.
న్యూగు జూ నుంచి తప్పించుకున్న తర్వాతి రోజు దాన్ని చూసినట్లు అనేకమంది అధికారులకు చెప్పారు.
అలా చెప్పిన వారిలో కుక్కలను చూసి అదే తోడేలుగా భావించిన చిన్న పిల్లలు ఉన్నారని స్థానిక పత్రికలు రిపోర్ట్ చేశాయి.
ఒక దశలో స్థానికుడొకరు తన తోడేలురూపంలో ఉండే తన కుక్క సాయంతో న్యూగును పట్టుకునేందుకు సహకరించడానికి సిద్ధమని చెబుతూ అధికారులను సంప్రదించారు.
ఆ తర్వాత న్యూగు నగర వీధుల్లో నడుస్తున్నట్లుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.
దీంతో అధికారులు తమ గాలింపును నగరం అంతటకీ విస్తరించారు.
తోడేలు కోసం వెదుకులాట కొనసాగుతున్న సమయంలోనే ఆ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినట్లు తేలింది.
2018లో డేజియోన్ పోలీసులు పొరొంగి అనే 8 ఏళ్ల చిరుత పులిని కాల్చి చంపారు.
చిరుతకు జరిగినట్లుగా తోడేలుకు ఏ హానీ జరక్కూడదని దక్షిణ కొరియా అధ్యక్షుడు సహా అనేకమంది ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
"తోడేలు కారణంగా ఎవరికీ ఎలాంటి హాని జరక్కూడదు. అది క్షేమంగా జూలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నాను" అని దేశాధ్యక్షుకు ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
జంతు హక్కుల సంరక్షణ గ్రూపులు కూడా ఇదే అభిప్రాయన్ని వెలిబుచ్చాయి.
"2018లో పారిపోయి తర్వాత పోలీసుల కాల్పుల్లో చనిపోయిన చిరుతపులి కూడా డేజియోన్ ఓ వరల్డ్ ప్రాంతంలోనే ఇప్పుడు తోడేలు కూడా తప్పించుకుంది" అని యానిమల్ ఫ్రీడమ్ సాలిడారిటీ గ్రూప్ చెప్పినట్లు ఛోసున్ అనే పత్రిక తెలిపింది.
‘‘జూలో నిర్వహణ లోపాలు, ఆవరణలో నిర్మాణపరమైన లోపాల కారణంగా వల్ల ఒక జంతువు ప్రాణాలు ప్రమాదంలో పడటం అన్యాయం" అని యానిమల్ ఫ్రీడమ్ సాలిడారిటీ గ్రూప్ తెలిపింది.
తోడేలును "స్వేచ్ఛకు ప్రతీక"గా, 'బంధనాల్లో ఉండటానికి ఇష్టపడని జంతువు'గా పేర్కొంటూ మీమ్ కాయిన్లు కూడా తయారవుతున్నాయి.
ఈ మీమ్ కాయిన్ 24 గంటల్లో లక్షన్నర డాలర్ల వ్యాపారాన్ని నమోదు చేసింది.
వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితి
న్యూగు 2024లో పుట్టింది. ఒకప్పుడు దక్షిణ కొరియా అడవుల్లో స్వేచ్ఛగా సంచరించి.. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతిగా భావిస్తున్న కొరియన్ తోడేళ్ల జాతిని పునరుద్ధరించేందుకు ‘ఓ వరల్డ్’ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా న్యూగును ఈ జూలో ఉంచి సంరక్షిస్తున్నారు.
1916లో ఓ అమెరికన్ వార్తా పత్రిక వర్ణించినట్లుగా కొరియన్ తోడేళ్లు "తీక్షణమైన కళ్లు, అద్భుతమైన చురుకుదనం" తో ఉంటాయి.
"ఇవి మనుషులపై దాడి చేసేటప్పుడు వాళ్లను కొంతసేపు అనుసరించిన తర్వాత ఎగిరి తలపై దాడి చేస్తాయి. దాడి చేశాక ఆ వ్యక్తి భయంలో ఉండగానే కింద పడేయడానికి ప్రయత్నిస్తాయి. కింద పడగానే దాడి చేసి చంపేస్తాయి" అని ఆ అమెరికన్ పత్రిక కథనం తెలిపింది.
ఓ వరల్డ్ నుంచి న్యూగు తప్పించుకోగానే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను మూసివేశారు.
స్వేచ్ఛగా తిరిగే కొరియన్ తోడేలు వల్ల స్థానికులకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితి తోడేలుకు కూడా ప్రమాదకరమే.
న్యూగు చాలా కాలంగా బందీగా ఉంది కాబట్టి, దానిలో క్రూర జంతువులకుండే లక్షణాలు ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా తెలియదు. దానికి ఇప్పటి వరకు వేటాడిన అనుభవం కూడా లేదు. న్యూగు భద్రతపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అడవుల్లో ఉండే తోడేళ్ల గుంపు ఆహారం కోసం ప్రధానంగా జింకలు, ఆవులు, పందుల వంటి గిట్టలు ఉండే శాకాహార జంతువులను వేటాడతాయి. వారాల తరబడి ఆహారం లేకున్నా కూడా ఇవి తట్టుకోలగవు.
న్యూగు తప్పించుకోవడానికి ముందు రోజు రాత్రి దానికి రెండు కోళ్లను ఆహారంగా ఇచ్చారు.
న్యూగు తప్పించుకుపోయిన ఓ వరల్డ్ దగ్గర ఉన్న మైకుల్లో నక్కల ఊళలు, అది చిన్నప్పటి నుంచి విన్న పార్క్ ప్రకటనలను పెద్ద శబ్ధంతో వినిపిస్తున్నారు.
న్యూగు గురించి డేజియోన్ అధికారులు చివరిసారిగా విడుదల చేసిన ఫుటేజ్‌లో అది ఆకులపై కాసేపు పడుకోవడం, తర్వాత లేచి అటు ఇటు తిరగడం కనిపిస్తోంది.
ఆ వీడియో కింద "న్యూగును సురక్షితంగా పట్టుకోవాలని కోరుకోండి" అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)