You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బల్లులంటే మనుషులకు ఎందుకు భయం, అవి లేకపోతే ఏమవుతుంది?
- రచయిత, కె. శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
రాత్రివేళ గాలిలేక ఒకవైపు ఉక్కపోస్తుండగా, తన ఆరేళ్ల కొడుకును నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు 34 ఏళ్ల కవిత.
కరెంట్పోయి అప్పుడే రావడంతో, ఫ్యాన్ పెద్ద శబ్దం చేస్తూ తిరగడం మొదలైంది. ఎప్పటిలాగే ట్యూబ్‌లైట్ చుట్టూ పురుగులు గుంపుగా చేరాయి.
"అప్పుడు నా కొడుకు హఠాత్తుగా భయంతో, 'అమ్మా!' అని అరుస్తూ, గోడకు అతుక్కుని ఉన్న బల్లిని చూపించాడు" అని కవిత చెప్పారు.
లేత గోధుమ రంగులో ఉన్న ఆ బల్లి, పైకప్పు మూల దగ్గర గోడకు అతుక్కుని ఉంది. ‘‘దాన్ని బయటకు ఊడ్చేయడానికి నేను చీపురు తీశాను. ఈలోపు అది గోడ మీదున్న దోమను చటుక్కున మింగేసింది’’ అని ఆమె చెప్పారు.
"మా ప్రాంతంలో డెంగ్యూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఆ రోజే నేను విన్నాను. ఆ బల్లి దోమను పట్టుకుని తినడం చూసి నేను ఒక్క క్షణం ఆలోచించాను" అని చెన్నైకి చెందిన కవిత చెప్పారు.
మదురైకి చెందిన వన్యప్రాణి ప్రేమికుడు శాంసన్ కృపాకరన్ కూడా ఇలాంటి అనుభవాన్నే పంచుకున్నారు.
"ఒకరోజు నేను ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాను. ఒక బల్లి అటుగా వచ్చి, నెమ్మదిగా నా కాలు మీదకు ఎక్కి, నన్ను కుడుతున్న కొన్ని దోమలను ఒక్కొక్కటిగా పట్టుకుని తినేసింది’’ అని శాంసన్ వివరించారు.
‘‘కొన్ని క్షణాలపాటు నా కాలు మీదే ఉండి, తర్వాత వెళ్ళిపోయింది" అన్నారాయన.
దోమల నుంచి రక్షించే వ్యవస్థ
2025లో భారత్ అంతటా డెంగ్యూ జ్వరం కేసులు గణనీయంగా పెరిగాయి.
2025 జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో తమిళనాడులో 20,866కు పైగా డెంగ్యూ కేసులు, 12 మరణాలు నమోదైనట్టు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ఈ సమస్య ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మదురై వంటి జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో ఎక్కువగా ఉంది.
ఒకవైపు నిల్వ ఉన్న నీటిని తొలగించడానికి, దోమల నివారణ మందులను ఉపయోగించడానికి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి.
కానీ మరోవైపు దోమల నుంచి రక్షించే వ్యవస్థ మన ఇళ్లలోనే నిశ్శబ్దంగా పనిచేస్తోందని వన్యప్రాణి కార్యకర్త శాంసన్ అంటున్నారు.
మనుషులలో దోమలు, బొద్దింకల వంటి వ్యాధి వాహక కీటకాల సంఖ్యను నియంత్రించడంలో బల్లులది కీలకపాత్ర. ఇవి కనుమరుగవ్వడం నగరాల్లో దోమలు పెరిగిపోవడానికి ఒక కారణమని ఆయన అంటున్నారు.
మనుషులకు దూరంగా ఉంటూ...కీటకాలను వేటాడుతూ...
లేత గోధుమరంగులో ఉండి ఇళ్లలో తిరిగేవి, మానవ పరిసరాలకు బాగా అలవాటుపడిన బల్లుల జాతికి చెందినవని అగస్త్యమలై కమ్యూనిటీ కన్సర్వేషన్ సెంటర్ పరిశోధకులు డాక్టర్ ఎ.తనిగైవేల్ అంటున్నారు.
"బల్లులది దూకుడు స్వభావం కాదు. చాలా సున్నితమైనవి, మనుషులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతాయి. ఇంటి పరిసరాల్లోని కీటకాలను సమర్థవంతంగా వేటాడతాయి" అని తనిగైవేల్ వివరించారు.
దోమలు, ఈగలు, చీమలు లేదా బొద్దింకలు వంటి దీపాల కాంతికి ఆకర్షితులయ్యే ఏ కీటక జాతినైనా బల్లులు వేటాడతాయని డాక్టర్ తనిగైవేల్ చెప్పారు.
"పట్టణ ప్రాంతాల్లో మారుతున్న జీవనశైలి ఫలితంగా బల్లులకు అనువైన పర్యావరణం గణనీయంగా తగ్గిపోతోంది. అందువల్ల ఇటీవలి కాలంలో మానవ నివాసాల మధ్య వాటిని చూడటం అరుదైపోయింది. బల్లులు సాధారణంగా విద్యుత్ దీపాల కాంతికి ఆకర్షితులయ్యే చిన్న జీవులను తినడానికి వస్తాయి. అయితే అవి తలదాచుకోవడానికి అనువైన స్థలాలు మునుపటిలా సమృద్ధిగా లేకపోవడం కూడా ఒక సమస్య" అని ఆయన అన్నారు.
కీటకాలే కాకుండా బల్లుల సంఖ్య కూడా పెరిగితే, పెద్ద బల్లులు.. చిన్న బల్లులను పట్టుకుని తింటాయని, తద్వారా వాటి సంఖ్యను అవే నియంత్రించుకుంటాయని డాక్టర్ తనిగైవేల్ అంటున్నారు.
పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలో ఉండే బల్లుల ఆవాసాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని, దీంతో వాటి సంఖ్య క్షీణిస్తోందని ఆయన చెప్పారు.
ప్రకృతి సమతుల్యతలో బల్లుల పాత్ర
సాధారణంగా బల్లుల రూపం, మలం, అవి చేసే శబ్దాల కారణంగా అవి ఇళ్లలో తిరుగుతుంటే కొంతమంది చిరాకుపడతారు. అయితే అవి సహజ కీటక నియంత్రకాలుగా పనిచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బల్లుల జనాభా అదుపులో ఉన్నప్పటికీ, అవి సహజ కీటక నియంత్రకాలుగా పర్యావరణ సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని.. గతేడాది ఇండోనేషియాలోని ఐపీపీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అచ్మత్ ఫరాజల్లా ఒక అధ్యయనంలో వెల్లడించారు.
బల్లులు వ్యాధులను వ్యాపింపజేస్తాయనే విషయం ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. మలయా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో 20 నుంచి 60 శాతం బల్లుల పేగులలో 'సాల్మొనెల్లా' అనే బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారని డాక్టర్ అచ్మత్ తెలిపారు.
అయితే ఆ బ్యాక్టీరియా ప్రభావాలు ఒక వ్యక్తికి వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చని, బల్లి పడిన ఆహారాన్ని తిన్న కొద్దిసేపటికే మనుషులు అనారోగ్యం పాలవుతారన్నది శాస్త్రీయంగా నిరూపితం కాలేదని శాంసన్ కృపాకరన్ అంటున్నారు.
అలాగే ఆహార కాలుష్యానికి పెద్ద ప్రమాదం బల్లులు కాదని, సరిగ్గా ఉడికించని ముడి పదార్థాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు ధృవీకరించాయి.
నగరాల పర్యావరణం
దోమల కారణంగా డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన దోమలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే కప్పలు, తొండలు, బల్లుల వంటి జీవుల సంఖ్య పట్టణ ప్రాంతాల్లో తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమని శాంసన్ కృపాకరన్ అంటున్నారు.
"ముఖ్యంగా బల్లులు దోమలను మాత్రమే కాకుండా, బొద్దింకలతో సహా ఇళ్ల చుట్టూ ఉండే అనేక ఇతర కీటక జాతులను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సహజ పారిశుధ్యానికి వాటి ఉనికి చాలా అవసరం" అని ఆయన అన్నారు.
బల్లులు దోమలను పూర్తిగా నిర్మూలించకపోయినా, చాలా ఇళ్లలో దోమల ప్రభావాన్ని క్రమంగా తగ్గించడంలో సాయపడతాయని నిపుణులు అంటున్నారు.
"ఇది ఇంట్లో ఉండే ఒక బల్లికి సంబంధించిన విషయం కాదు. నగరం అంతటా వేలాది బల్లులు ప్రతిరోజూ చేసే పర్యావరణ సేవకు సంబంధించింది" అని శాంసన్ వివరించారు.
నగరాలు కాంక్రీట్ భవనాలు, కృత్రిమ వెలుగులు, మనుషుల కార్యకలాపాలకు అనుగుణంగా మారిన వివిధ జీవుల సహజీవనంపై ఆధారపడిన ఆధునిక పర్యావరణ వ్యవస్థలు.
ఉదాహరణకు ఎక్కువ కాలం తేమగా ఉండే చెన్నై వంటి నగరాల్లో ఇలాంటి జీవావరణ మండలాలు సజీవంగా ఉంటాయి.
నిల్వ ఉన్న నీరు, తెరిచివున్న మురుగు కాల్వలు, నీటి గుంటలు, నిర్మాణ స్థలాలలోని చెత్త కుప్పల వంటి ప్రదేశాలలో కీటకాలు వృద్ధి చెందుతాయి. బల్లులవంటి జీవులు వాటిని వేటాడి తినడం చాలా అవసరం.
బల్లులు లేకపోతే ఏమవుతుంది?
ఇంట్లో బల్లులు లేకపోతే, సహజ శత్రువులు లేకపోవడం వల్ల పురుగులు అదుపు లేకుండా పెరిగిపోతాయి.
బల్లులు కనుమరుగవడం వల్ల కలిగే సంక్షోభం రాత్రికి రాత్రే కనిపించదు. కానీ కీటకాల ద్వారా మానవులకు సంక్రమించే వివిధ వ్యాధులను నివారించడంలో వాటి పాత్ర అపారమైనదని, అవి లేనందుకు అనేక పరిణామాలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని శాంసన్ అన్నారు.
"బల్లులంటే భయం లేదా అసహ్యం ఏమాత్రం మారలేదు. కానీ అవి కనపడితే వాటిని వదిలించుకోవాలనే ఆలోచనను విరమించుకున్నాను" అని కవిత అంటున్నారు.
"ఇప్పుడు నా కొడుకు కూడా వాటిని చూసి అంతగా భయపడటం లేదు. అవి వేటాడటం చూసి ఆశ్చర్యపోతున్నాడు. వాటి పర్యావరణ ప్రాధాన్యతను నాకు చెబుతున్నాడు. మనుషులు, ఇతర జీవులు కలిసి జీవించాలంటే.. నాలాంటి వాళ్ళు భయాన్ని, అసహ్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కావలసిందల్లా కొద్దిపాటి అవగాహన మాత్రమే. మన చుట్టూ ఉన్న పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి బల్లుల ఉనికి చాలా ముఖ్యమని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా" అని కవిత అన్నారు.
దోమలతో సహా కీటకాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి రసాయనాలు, పురుగుమందుల వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయితే వాటి వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని డాక్టర్ తనిగైవేల్ అంటున్నారు.
"కీటకాలు కాలక్రమంలో రసాయనాలకు అలవాటు పడి వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటాయి. అదే సమయంలో ఈ రసాయనాలను తిన్న కీటకాలను తినే జీవులపైనా, వాటిని వేటాడే ఇతర జీవులపై కూడా ప్రభావం చూపుతాయి. కప్పలు, బల్లుల వంటి జీవుల సహజమైన, సమతుల్య జీవన విధానమే ఇటువంటి దుష్ప్రభావాలు లేని ఒక పరిష్కారం" అని తనిగైవేల్ వివరించారు.
బిజీ నగరాల్లోని అపార్ట్మెంట్లు అయినా, పంట పొలాల మధ్య ఉన్న గ్రామాల ఇళ్లు అయినా బల్లులు వంటి జీవులు మనుషుల నివాసాలకు అలవాటు పడి అక్కడే జీవిస్తున్నాయి. అందువల్ల వాటిని మన రోజువారీ జీవితాల నుంచి పూర్తిగా దూరం చేయలేం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)