సహారా ఎడారి మధ్యలో చెడిపోయిన లారీ.. నీళ్లు దొరక్క దాహంతో 49 మంది మృతి

ఫొటో సోర్స్, Agadez governorate/Facebook
- రచయిత, వైక్లిఫ్ మౌయా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఉత్తర నైజర్‌లోని సహారా ఎడారిలో ఒక మారుమూల ప్రాంతంలో ప్రయాణిస్తున్న లారీ దారి మధ్యలో చెడిపోవడంతో కనీసం 49 మంది నీళ్లు దొరక్క దాహంతో మరణించినట్లు అధికారులు తెలిపారు.
మాలీలో ఒక ముస్లిం పండుగలో పాల్గొని తిరుగు ప్రయాణంలో లారీలో వస్తుండగా.. నైజర్–ఆల్జీరియా సరిహద్దులోని అస్సామాకాకు పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో వారంతా ఎడారిలో చిక్కుకుపోయారు.
"తీవ్రమైన వేడిమి, సమీప దూరంలో ఎలాంటి సరఫరా కేంద్రాలు లేకపోవడం, అత్యంత కఠిన వాతావరణంలో ఈ ప్రయాణికులు చిక్కుకుపోయారు" అని అగాడెజ్ గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు.


ఫొటో సోర్స్, Agadez governorate/Facebook
లారీలో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
వారు నడుచుకుంటూ ఎడారిని దాటి అస్సామాకాకు చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆ లారీ మాలీలోని టెల్హాండెక్ పట్టణం నుంచి బయలుదేరిందని, అయితే మొదట నిర్ణయించుకున్న మార్గం నుంచి దారి మళ్లిందని గవర్నర్ ప్రకటనలో ఉంది.
లారీ చెడిపోయిన తరువాత కొన్ని రోజుల పాటు డ్రైవర్, అందులోని ప్రయాణికులు వాహనాన్ని మరమ్మతు చేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
"నీరు లేకపోవడం అలాగే డ్రైవర్, సహాయకుడు, ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వాహనాన్ని మరమ్మతు చేయలేకపోయారు. దీంతో లోపలున్న వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో చిక్కుకుపోయారు" అని అగాడెజ్ గవర్నర్ ప్రకటనలో ఉంది.
"నిలిచిపోయిన లారీ కింద, దాని చుట్టూ డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించాయి" అని ఆ ప్రకటనలో తెలిపారు.
స్థానిక అధికారులు పంపిన సహాయ బృందం మృతులను సామూహిక ఖననం చేసింది.
ఘటనా స్థలం నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. మూడు రోజులుగా ఎడారిలో చిక్కుకుపోయిన మరో 60 మందికి పైగా ప్రయాణికులు కనిపించారని.. వారు ప్రయాణిస్తున్న లారీ బ్యాటరీ చెడిపోయి ఎడారి మధ్యలో ఆగిపోయిందని సహాయ బృందం తెలిపింది.
ఆ లారీ మాలీలోని హరూబా పట్టణం నుంచి బయలుదేరిందని, అది నైజర్ సరిహద్దుకు 300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉందని గవర్నర్ అనంతరం మరో ప్రకటనలో తెలిపారు.
నైజర్ సైనికులు కూడా ఉన్న సహాయ బృందం "అలసటతో, తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రయాణికులకు" నీటిని పంపిణీ చేసి, వాహనాన్ని మరమ్మతు చేయడంలో సహాయం చేసింది. దీంతో వారు సురక్షితంగా తమ ప్రయాణాన్ని కొనసాగించగలిగారు.
పశ్చిమ ఆఫ్రికా అంతటినుంచి యూరప్ చేరేందుకు ప్రయత్నించే వలసదారులకు నైజర్ ఎడారి ఇప్పటికీ ప్రధాన రవాణా మార్గంగానే ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























