‘నేనొక డాక్టర్‌ను అనుకున్నా’ - ఏసుక్రీస్తును పోలిన చిత్రంపై విమర్శలకు డోనల్డ్ ట్రంప్ వివరణ

డోనల్డ్ ట్రంప్, ఏసుక్రీస్తు, ట్రూత్ సోషల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బెర్ండ్ డెబుస్మాన్ జూనియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఏసుక్రీస్తును పోలిన రూపంలో తనను చూపిస్తున్న వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తొలగించారు.

ఆసుపత్రిలో రోగిని స్వస్థపరుస్తున్నట్లు ఉన్న ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిత్రంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతా నుంచి దానిని తీసివేశారు. ట్రంప్‌ను గట్టిగా సమర్థించే వారు కూడా ఈ పోస్టును తప్పుబట్టారు.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలను ఖండించిన పోప్ లియోపై ట్రంప్ విమర్శలు చేసిన కొన్ని గంటలకే ఈ పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆ చిత్రాన్ని తానే పోస్ట్ చేసినట్లు ధ్రువీకరించిన ట్రంప్, అది తనను ఒక 'డాక్టరు'గా చూపిస్తోందని భావించినట్లు మీడియాకు చెప్పారు.

తీసేసిన ఆ చిత్రంలో ట్రంప్ తెల్లని షర్ట్ ధరించి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నుదుటిపై మెరుస్తున్న చేతిని ఉంచారు. ఇది ఏసుక్రీస్తు రోగులను నయం చేసే మతపరమైన చిత్రాలను పోలి ఉందని విమర్శకులు పేర్కొన్నారు.

ఆ చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, రెపరెపలాడుతున్న అమెరికా జెండా, యుద్ధ విమానాలు, గద్ద ఉన్నాయి. అలాగే ఒక నర్సు, ప్రార్థన చేస్తున్న మహిళ, ఒక సైనికుడు కూడా కనిపిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, ఏసుక్రీస్తు, ట్రూత్ సోషల్

ఫొటో సోర్స్, TruthSocial.com/@realDonaldTrump

ఫొటో క్యాప్షన్, ట్రూత్ సోషల్‌లో డోనల్డ్ ట్రంప్ పోస్టు చేసిన ఏఐ చిత్రం

నేనొక డాక్టర్‌ను అనుకున్నా: ట్రంప్

ఆ చిత్రాన్ని తొలగించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. అందులో తాను ఒక డాక్టరుగా, పక్కన రెడ్ క్రాస్ కార్యకర్త ఉన్నట్లు భావించానని వివరణ ఇచ్చారు.

"ప్రజలను బాగుచేసే ఒక డాక్టరుగా ఆ చిత్రం ఉండాల్సింది. నేను ప్రజలను బాగుచేస్తాను, చాలా బాగుచేస్తాను" అని ఆయన చెప్పారు.

"ఎవరూ గందరగోళపడకూడదనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని తొలగించాను. ప్రజలు అయోమయానికి గురయ్యారు" అని బీబీసీ భాగస్వామ్య సంస్థ 'సీబీఎస్ న్యూస్'తో ట్రంప్ అన్నారు.

ట్రంప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుంచి కూడా ఆ చిత్రంపై వెంటనే విమర్శలు వచ్చాయి.

"దీనిని వెంటనే తొలగించాలి" అని క్రైస్తవ మతానికి చెందని కార్యకర్త షాన్ ఫ్యూచ్ట్ డిమాండ్ చేశారు.

అమెరికా స్వాతంత్ర్య ప్రకటన 250వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన, "ఇది ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు" అని స్పష్టం చేశారు.

"దేవుడిని అపహాస్యం చేయకూడదు" అని కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ రైలీ గెయిన్స్ తెలిపారు. అమెరికాలోని మత విశ్వాసాలున్న అనేక క్రైస్తవ వార్తా సంస్థలు దీనిని తీవ్రంగా విమర్శించాయి.

"ఇది హద్దులు దాటిన చర్య" అని క్రిస్టియన్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ జర్నలిస్ట్ డేవిడ్ బ్రాడీ అభిప్రాయపడ్డారు.

"ఒక మద్దతుదారు ఆయన లక్ష్యాన్ని సమర్థిస్తూనే, ఇలాంటి వాటిని తిరస్కరించవచ్చు" అని తెలిపారు.

డోనల్డ్ ట్రంప్, ఏసుక్రీస్తు, ట్రూత్ సోషల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోప్ లియో

పోప్ లియో విమర్శల నేపథ్యంలో..

'నేరాల విషయంలో బలహీనంగా' ఉన్నారని, 'విదేశాంగ విధానంలో దారుణంగా' ఉన్నారని పోప్ లియో విమర్శించిన గంటలోపే ట్రంప్ ఈ వివాదాస్పద చిత్రాన్ని పోస్ట్ చేశారు.

పోప్ లియో అమెరికా నుంచి ఎన్నికైన మొదటి పోప్. ఇరాన్‌లో యుద్ధాన్ని ఆయన పదేపదే ఖండిస్తూ వచ్చారు. ఇరాన్ యుద్ధం 'అహేతుకమైన, అమానవీయమైన హింస'కు దారితీసిందని పోప్ అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ, తాను ఇక్కడికి వచ్చింది సువార్త సందేశాన్ని గట్టిగా వినిపించడానికేనని, ట్రంప్ ప్రభుత్వం అంటే తనకు ఎలాంటి భయం లేదని అన్నారు.

వైట్‌హౌస్‌లో విలేఖరులతో మాట్లాడిన ట్రంప్, తన పోస్ట్ పట్ల క్షమాపణలు చెప్పలేదు.

"పోప్ లియో చెప్పిన విషయాలు తప్పు. ఇరాన్ విషయంలో నేను చేస్తున్న పనులను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారడాన్ని అంగీకరించలేం. దీని పర్యవసానాలు తెలిస్తే పోప్ లియో కూడా సంతోషించరు" అని ట్రంప్ అన్నారు.

డోనల్డ్ ట్రంప్, ఏసుక్రీస్తు, ట్రూత్ సోషల్

ఫొటో సోర్స్, Brendan SMIALOWSKI / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఇదే మొదటిసారి కాదు..

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతా ద్వారా విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.

గత ఫిబ్రవరిలో బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరించిన ఒక జాత్యహంకార వీడియో ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ అయ్యింది. ఆ తర్వాత దానిని తొలగించారు.

మొదట్లో ఆ వీడియోను ఒక 'ఇంటర్నెట్ మీమ్ వీడియో'గా వైట్‌హౌస్ సమర్థించింది.

పలువురు రిపబ్లికన్ సెనేటర్ల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పోస్ట్‌ను తొలగించారు.

ఒక సిబ్బంది 'పొరపాటున' ఆ వీడియోను పోస్ట్ చేశారని వైట్‌హౌస్ అధికారి ఒకరు తర్వాత వివరణ ఇచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)